‘నాగమణి’ కోసం అన్వేషణ!: కోట్లు పోసి సొంతం చేసుకోవటానికి పాట్లు

నాగమణి. నాగుపాము పడగపై నాగమణి ఉంటుందని అది చాలా విలువైనదనీ..అది ఉంటే అదృష్టం వరిస్తుందని నాగమణికి విలువ కట్టలేమని ఇలా ఎన్నో నమ్మకాలున్నాయి. నాగమణిపై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. నాగమణిని దక్కించుకోవటానికి చేసే ఎత్తులు..పై ఎత్తులతో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ అసలు నాగమణి అనేదే లేదని కొందరి వాదన.
నాగమణి.. చాలా విలువైనదనీ..దానికి మహాద్భుతమైన మంత్ర శక్తులు కలిగినదని .. హిందువుల నమ్మకం. నవరత్నాలకూ.. వజ్ర వైడూర్యాలకూ లేని శక్తి నాగమణి సొంతమని భావిస్తారు. నాగమణి ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయాని కూడా కొంతమంది చెప్తుంటారు. నాగమణి ఉన్న పాములకు విశేష శక్తులు ఉంటాయట. నాగమణి వల్లే అవి ఏ రూపంలోకి మాలాంటే ఆ రూపంలోకి మారిపోతాయట.
స్వాతి నక్షత్రం రోజు.. వర్షం పడినప్పుడు.. ఆ వర్షపు బిందువు నాగు పాము నోట్లోకి వెళ్లడం ద్వారా .. మణి రూపొందడం మొదలవుతుందని .. ఇలా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కేవలం ఈ మణి నాగుపాములో మాత్రమే రూపొందుతుందని. ఎందుకంటే.. నాగుపాము మాత్రమే ఈ భూమ్మీద వంద ఏళ్లు బతకగలుగుతుందనే ప్రచారం ప్రజల్లో ఉంది.
నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుంది. అయితే ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు, తేనె, లేత ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులే. అటువంటి నాగమణి మీదగ్గరుంటే అంతులేని ఐశ్వర్యం మీసొంతమవుతుందని, లెక్కలేనంత ఆస్తిపాస్తులు కలిసి వస్తాయనే ప్రచారాలు చాలా ఉన్నాయి. చాలా సినిమాల్లో చూశాం కూడా.
నాగమణి, దాని విశిష్టత, నాగ మణిని దొంగిలించిన వారు.. పాము కాటుతో తమ ప్రాణాలు కోల్పోయినట్టుగా చాలా సినిమాల్లో చూశాం. అయితే ఈ కాలంలోనూ నాగమణి, పాములు పగబట్టడం వంటి అంశాలను చాలామంది గుడ్డిగా నమ్మేస్తున్నారు. కోట్లకు పడగలెత్తాలన్న దురాశతో .. నాగమణి కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారి అత్యాశను కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.
నాగమణి, పంచలోహ దుర్గామాత విగ్రహం పేరిట ఓ ముఠా కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమైంది. దుర్గామాత విగ్రహం చేతిలో నాగమణి పెట్టి పూజిస్తే.. మీకు తిరుగుండదని నమ్మించే ప్రయత్నం చేసింది. వ్యాపారం వృద్ధి చెందుతుందని.. ధనవంతులు అవుతారని ప్రచారం చేసింది. అంతేనా ఇత్తడి విగ్రహాన్ని పంచలోహ విగ్రహంగా నమ్మించి కోట్లు దండుకునేందుకు ప్లాన్ వేసింది.
జియాగూడాకు చెందిన దేవేందర్ ఓ గుర్తుతెలియని వ్యక్తి దగ్గర నాగమణి అనుకుని ఓ నల్లరాయిని కొనుగోలు చేశాడు. ఇతనికి కూకట్‌పల్లిలో ఉంటున్న టీ జాన్, దుర్గా ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అయితే తన దగ్గరున్న నాగమణి, దుర్గామాత విగ్రహాన్ని పూజిస్తే ధనవంతులు అవుతారని.. దేవేందర్ వారిని నమ్మించాడు. కొనుగోలుదారుడిని చూపిస్తే.. కమిషన్ ఇస్తానని ఆశపెట్టాడు. వీరికి ఆష్రప్, యూపీకి చెందిన ప్రేమ్‌చంద్ గుప్తా జతకలిశారు. వీరంతా కలిసి కొనుగోలుదారుడి కోసం వెతికారు.
హైదరాబాద్ జియా గూడా ప్రాంతంలో విగ్రహాన్ని విక్రయించేందుకు ఈ ముఠా ప్రయత్నించింది. అదే సమయంలో వీరంతా పోలీసులకు చిక్కారు. దీంతో ఈ ముఠా సభ్యులను విచారించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి విగ్రహంతో పాటు నల్లటిరాయి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా నాగమణి పేరుతో మోసం చేయాలని స్కెచ్ వేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాకినాడలో ఇత్తడి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. దాన్నే పంచలోహ విగ్రహంగా నమ్మించి .. కోటి రూపాయలకు అమ్మాలనుకున్నట్లు డీసీపీ రాధా కిషన్ రావు తెలిపారు.