వయస్సు 16.. కరడుగట్టిన బాల నేరస్తుడు

వయస్సు ఏమో 16. ఘరనా దొంగకు ఏమాత్రం తీసిపోడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బాలుడు చేసిన నేరాలు చూస్తే పోలీసులే షాక్ తిన్నారు. మొత్తం 23 కేసులున్నాయి. ఇతడితో పాటు ఓ మేజర్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన పి.వెంకటేశ్వర్లు భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. అశోక్ నగర్‌లో నివాసం ఉండేవాడు. హాస్టల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతని కుమారుడు పి.వీరబాబు అలియాస్ వినోద్ అలియాస్ వీరా నాలుగో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థితో ఘర్షణకు దిగి చెయి విరగ్గొట్టాడు. దీనితో పాఠశాల యాజమాన్యం సీరియస్ అయి..టీసీ ఇచ్చి పంపిచేసింది. కూకట్ పల్లిలో ఉండే పెద్దమ్మ దగ్గరకు కుటుంబసభ్యులు పంపించారు. అక్కడ చోరీలకు పాల్పడడం నేర్చుకున్నాడు. ఇతని ఆగడాలతో తల్లిదండ్రులు మనస్థాపానికి గురై సొంత గ్రామానికి వెళ్లిపోయారు.
నాలుగు సార్లు అరెస్టయ్యాడు. జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అక్కడి నుంచి రెండుసార్లు తప్పించుకున్నాడు. హోంలో పరిచయమైన ఈషిపాక గణేష్, రాంనగర్ లక్ష్మమ్మ పార్కు వద్ద ఉండే బాల నేరస్తుడు మద్దెల సిద్దార్థ అలియాస్ సిద్ధూ, హరినగర్‌కు చెందిన విద్యార్థి నాంపల్లి సాల్ మన్ రాజులతో కలిసి వీరబాబు చోరీలకు పాల్పడేవాడు. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం గోల్కోండ క్రాస్ రోడ్డులో వీరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. పోలీసులు విచారించగా వీరి గుట్టురట్టైంది. ద్విచక్ర వాహనాలు, బంగారు గొలుసులు, సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వీరి నుంచి రూ. 1.70 వేల రెండు యాక్టీవాలు, 2 సెల్ ఫోన్లు, ఒక ముత్యాల దండ, 25 తులాల వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వ ప్రసాద్ వెల్లడించారు.
ముషీరాబాద్, నల్లకుంట, చిక్కడపల్లి, గాంధీ నగర్ పీఎస్‌ల పరిధిలో 7 కేసులు నమోదయ్యాయి. బాచుపల్లి పీఎస్ 2 కేసులు, మియాపూర్ లో 11 కేసులు, కూకట్ పల్లి, సనత్ నగర్, సైదాబాద్, ఒక్కో కేసు..ఇలా మొత్తం 16 కేసులు ఇతడిపై నమోదయ్యాయి.
Read More :ఎంటెక్ చదివి సైబర్ నేరాలు : ఉద్యోగాలు, లోన్లు పేరుతో చీటింగ్