కేసీఆర్ పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గం ఏదీ ?

హైదరాబాద్ : జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారా ? చేస్తే ఎక్కడి నుండి పోటీ చేస్తారు ? మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుంటారు ? అనే దానిపై తెలంగాణ రాష్ట్రంలో చర్చ కొనసాగుతోంది. అటు రాజకీయాలు…ఇటు ప్రజల్లో ఈ అంశంపై తెగ చర్చ జరుగుతోంది. కేసీఆర్ జాతీయ స్ధాయికి వెళితే.. మరి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ?
ఎంపీగా కేసీఆర్ పోటీ…
ముఖ్యమంత్రిగా ఉన్న కేసిఆర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో.. ఏ నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారన్నది పార్టీలో చర్చనీయంశంగా మారింది. గతంలో విజయం సాధించిన మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలతో పాటు మల్కాజిగిరి, నల్గొండ నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేసిఆర్ సొంత నియోజకవర్గం కూడా కావడంతో మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కరీంనగర్ నుంచి ఎంపీగా వినోద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసిఆర్ అక్కడి నుంచే విజయం సాధించి తెలంగాణా సెంటిమెంట్‌ను రగిలించారు. ఈ విడత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ స్థానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోలేదన్న ప్రచారం అధికార పార్టీలో జరుగుతోంది. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో….ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడం కంటే కేసిఆర్ పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా కేసిఆర్ విజయం సాధించి ఢిల్లీలో కీలకం అయితే.. తెలంగాణాలో ముఖ్యమంత్రి పదవి కేటిఆర్ కు దక్కుతుందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.