జనతా కర్ఫ్యూ వేళ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 04:17 AM IST
జనతా కర్ఫ్యూ వేళ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం

Updated On : March 22, 2020 / 4:17 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కర్ఫ్యూ పాటిస్తున్న వేళ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. చేతికి ఉన్న స్టాంప్‌ ఆధారంగా ప్రయాణికుడికి కరోనా లక్షణాలున్నట్టు  గుర్తించిన రైల్వే పోలీసులు.. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తిని గమనించిన టీసీ, రైల్వే పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ టైమ్ లో రైల్లో ప్రయాణించాడు, ఏ దేశం నుంచి వచ్చాడు అనే ప్రశ్నలు అడిగారు. ఆ వ్యక్తి మాత్రం నోరు విప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆదివారం(మార్చి 22,2020) ఉదయం సుమారు 7.30గంటల ప్రాంతంలో ఆ వ్యక్తిని గుర్తించినట్టు టీసీ చెప్పారు. ఆ వ్యక్తి చేతి మీదున్న ముద్ర ఆధారంగా అనుమానం వచ్చిందన్నారు. ఆ వ్యక్తి ఏ దేశం నుంచి వచ్చాడు? ముంబై నుంచి ముంబై ఎక్స్ ప్రెస్ లో నాంపల్లికి ఏ బోగీలో వచ్చాడు? అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు. అతడు ప్రయాణించిన బోగీ ఏసీ బోగీగా చెబుతున్నారు. ఆ వ్యక్తి ఉన్న బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది ఆరా తీస్తున్నారు. 

ఆ వ్యక్తి నైజీరియా, లాగోస్ నుంచి అబుదాబి మీదుగా ముంబైకి వచ్చాడు. అక్కడి నుంచి ముంబై ఎక్స్ ప్రెస్ లో నాంపల్లి వచ్చాడు. అతడి చేతిపై హోం క్వారంటైన్ స్టాంప్ ఉంది. ఆ ముద్రే అతడిని పట్టించింది. అతడు కరోనా అనుమానితుడిగా గుర్తు పట్టిన తోటి ప్రయాణికులు టీసీకి సమాచారం ఇచ్చారు. టీసీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని గాంధీకి తరలించారు.

విదేశాల నుంచి వచ్చిన వారి చేతిపై హోం క్వారంటైన్ ముద్ర వేస్తారు. అంటే, వారు సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం) లో ఉండాలి. 14 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఎవరినీ కలవకూడదు. కరోనా లక్షణాలు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. అయితే కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. హోం క్వారంటైన్ ముద్ర వేసినా ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తుల కారణంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణం అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ 185 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 3లక్షల 6వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13వేల 17మంది కరోనాతో చనిపోయారు. 90వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇటలీలో ఒక్క రోజే 793 మంది చరిపోయారు. ఇటలీలో ఇప్పటివరకు కరోనాతో 4వేల 825మంది మరణించారు.

కరోనా భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. నలుగురు చనిపోయారు. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 63 కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
 
రోజురోజుకు ప్రభావం పెంచుకుంటూ.. కరోనా వైరస్ తెలుగు ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉండగా.. లేటెస్ట్‌గా రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.