కరెంట్ షాక్ : ఏపీ నుంచి రూ.5 వేల కోట్ల బకాయిలు రావాలి

  • Published By: chvmurthy ,Published On : March 8, 2019 / 04:29 PM IST
కరెంట్ షాక్ : ఏపీ నుంచి రూ.5 వేల కోట్ల బకాయిలు రావాలి

Updated On : March 8, 2019 / 4:29 PM IST

హైదరాబాద్ : తెలంగాణా విద్యుత్ సంస్ధలపై గత 2,3 రోజులుగా  ఏపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ట్రాన్స్కో  సిఎండి ప్రభాకర్ రావు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే  ఉల్టాచోర్‌ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఏపీ తెలంగాణకు ఇవ్వాల్సింది పోయి ఉల్టా మాట్లాడుతోంది. ఆరోపణలు చేసే ముందు ఆలోచించి, రిపోర్టును సరి చూసుకొని మాట్లాడితే బాగుండు అని ప్రభాకర్‌రావు హితవు పలికారు.

విద్యుత్‌ సంస్థల విషయంలో ఎన్ని ఉత్తరాలు రాసిన సెటిల్‌మెంట్‌ చేసుకోకుండా ఏపీ జెన్ కో  లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడం వెనుక  ఉద్దేశం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. పారదర్శకంగా విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాం. ఏపీ విద్యుత్‌ సంస్థలే తమకు బకాయి ఉన్నారు. ఏపీ విద్యుత్‌ సంస్థలు తమకు రూ. 2406 కోట్లు బాకీ ఉన్నారు. టీఎస్‌ జెన్‌కోకు ఏపీ జెన్‌కో నుంచి 3,096 కోట్లు రావాలి. ఏపీ డిస్కంల నుంచి రూ.1659 కోట్లు తెలంగాణ డిస్కంలకు రావాలి. రూ.5,600 కోట్లు తామే ఇవ్వాలని ఏపీ విద్యుత్‌ సంస్థలు అంటున్నాయి. కానీ ఏపీ విద్యుత్‌ సంస్థల నుంచి మొత్తం రూ. 5,785 కోట్లు తెలంగాణకు రావాలి. 

మాచ్‌ఖండ్‌ నుంచి మనకు రావాల్సిన విద్యుత్‌ ఇవ్వడం లేదు. లెక్కలు తేలాక ఒక్క రూపాయి ఇవ్వాల్సి ఉన్నా ఇచ్చేస్తాం. సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఏపీ విద్యుత్‌ సంస్థలను ఆహ్వానిస్తున్నాం.  ఏపీ విద్యుత్‌ సంస్థలు ముందుకు వస్తే 24 గంటల్లో సమస్యల పరిష్కారానికి మేము సిద్ధం. మనం ఇక్కడ సమస్యలు పరిష్కరించుకోలేకపోతే ఎన్‌సీఎల్టీకి పోవాలి. తాము చెబుతున్నా పట్టించుకోకుండా ఏపీ విద్యుత్‌ సంస్థలు ఎన్‌సీఎల్టీకి వెళ్లారు. దొంగే దొంగ అన్నట్లుంది ఏపీ విద్యుత్‌ సంస్థల తీరు. ఏపీలో విద్యుత్‌ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం  లోపించినట్లుందని ఆయన అభిప్రాయ పడ్డారు.  అధికారుల నుంచి ప్రభుత్వానికి సరైన సమాచారం అందడం లేదనిపిస్తుంది అని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.