అరెస్ట్ ఆపండి, కేసులు కొట్టేయండి : హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ పిటిషన్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండీ అశోక్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడి బయటికొచ్చారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
డేటా చోరీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డైరెక్టర్ అశోక్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. రాజకీయ కుట్ర, దురుద్దేశాల్లో భాగంగా తనపై కేసులు పెట్టారని కోర్టుకు నివేదించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ పోలీసులు పరిధి దాటి కేసులు నమోదు చేశారన్నారు. వైసీపీ, తెలంగాణ పోలీసులు కుమ్మక్కై కేసులు పెట్టారని, హైకోర్టు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. మాదాపూర్, సంజీవ్‌రెడ్డినగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ శుక్రవారం(మార్చి 8, 2019) హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు అశోక్. వీటిపై విచారణ ముగిసేదాకా అరెస్ట్ సహా దర్యాప్తు ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. అశోక్ వేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం(మార్చి 11) విచారణ జరిపే అవకాశం ఉంది.
ఐటీ గ్రిడ్స్ లో ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ జరుగుతోందని డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డి నగర్ (ఎస్‌ఆర్ నగర్) పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని అశోక్ తన పిటిషన్‌లలో తెలిపారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఏపీ ఓటర్లకు సంబంధించిన డేటాను సేవామిత్ర యాప్‌ల ద్వారా చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని అశోక్ వెల్లడించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఈ విషయంపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతనికి ఇక్కడి పోలీసులు చెప్పకుండా తమకు లేని పరిధిని ఉపయోగించి తెలంగాణ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు.
ఫిర్యాదుదారుల ఆరోపణలకు, తనపై పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై ఐపీసీ సెక్షన్లు 420, 419, 467, 468, 471, 120(బీ) వర్తించవని వివరించారు. ఫిర్యాదుదారు హైదరాబాద్ వాసి కాబట్టి అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసులు నమోదు చేయడం చెల్లదని అశోక్ వాదించారు. డేటా చోరీ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిందని, యుద్ధ ప్రాతిపదికన సిట్ దర్యాప్తు చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అశోక్ కోర్టును కోరారు. తాము ఎలాంటి డేటా దుర్వినియోగానికి పాల్పడలేదని, వ్యాపారపరమైన లావాదేవీలు మాత్రమే చేసినట్టు అశోక్ చెబుతున్నారు.
డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ సిట్ దర్యాప్తు ప్రారంభించి ‘ఐటీ గ్రిడ్స్’ కార్యాలయాన్ని సీజ్ చేసింది. అశోక్ కోసం ప్రత్యేక బృందాలతో పాటు.. సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్.. కోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. విచారణలో కోర్టు ఏం చెప్పబోతోంది..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.