విద్యార్ధుల ఆత్మహత్యలపై హరీశ్ రావు తీవ్ర ఆవేదన..

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 05:55 AM IST
విద్యార్ధుల ఆత్మహత్యలపై హరీశ్ రావు తీవ్ర ఆవేదన..

Updated On : April 21, 2019 / 5:55 AM IST

పరీక్షల రిజల్డ్స్ వచ్చాయంటే చాలు విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతుండటం సర్వసాధారణంగా మారిపోయింది. టార్గెట్లు,ర్యాంకులు ఇలా స్కూల్ యాజమాన్యాలు..తల్లిదండ్రులు తిడతారేననే భయం..ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే బంధువులు…చుట్టు పక్కలవారి ముందు చులనక అయిపోతామేమోననే భావనతో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాలలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జరిగాయి.

ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇంటర్‌లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదని, ప్రాణాలు తీసుకోవద్దని విద్యార్థులను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను ఒత్తిడికి గురిచేసే పనులు చేయొద్దని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హరీశ్ రావు సూచించారు. మన కంటి పాపలైన బిడ్డల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. 

‘కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడిపోయినట్లు కాదనీ..ప్రాణాలు పోతే తిరిగిరావు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రుల్ని, టీచర్లను కోరుతున్నా. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందాం’ అంటూ ట్వీట్ చేశారు. 

కాగా  తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల ప్రథమ సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ఫెయిల్ కావడం.. దీంతో పరీక్షలు ఎంతో బాగా రాస్తే తాము ఫెయిల్ కావటం ఏంటనే తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఒక్కరోజునే  తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు, ఇంటర్ బోర్డు అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దీనిపై ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు.