ప్రేమికుల రోజు : లక్ష మందికి భోజనం

హైదరాబాద్ : ఫిబ్రవరి 14..ప్రేమికుల రోజు…ప్రేమ పక్షులకు పండుగ దినం. ప్రేమలో మునిగిన వారు జాలీగా ఈ రోజును జరుపుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు మస్త్ మస్త్ ఎంజాయ్ చేసుకొనేలా ప్లాన్స్ వేసుకుంటుంటారు. కొంతమంది గుర్తుండిపోయేలా జరుపుకోవాలని అనుకుంటుంటారు. అయితే…ఈ రోజున నగరంలో వినూత్న ప్రయత్నం జరుగనుంది. లక్ష మందికి ఉచితంగా భోజనం అందించనున్నారు. ఫీడ్ ద నీడ్ పేరిట జరిగే ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆహారాన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండులు, ఆటో స్టాండులు, స్లమ్‌లు, మేజర్ ఆసుపత్రులు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్చంద సంస్థల సహకారంతో అందించనున్నట్లు అడిషనల్ కమిషనర్ హరిచందన వెల్లడించారు. సంస్థలు, వ్యక్తులు, ఇతరులు…95421 88884 (రజనీకాంత్), 96668 63435 (విశాల్), 98499 99018 (పవన్) నెంబర్లల ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14వ తేదీ గురువారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష మంది పేదలకు అన్నం పెట్టే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించేందుకు పలు హోటల్ యజమానులు, స్వచ్చంద సంస్థలు, ఇతరులు ముందుకొచ్చారు. దీనితో ఈ వినూత్న ప్రయోగం జరుగబోతోంది. 40 వేల మందికి ఆహారం అందించేందుకు దాతలు ముందుకు వచ్చారు.