అతడు కరోనాని జయించాడు

తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన తొలి కరోనా కేసులో బాధిత యువకుడు(24) కరోనాని జయించాడు. మహేంద్ర హిల్స్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుబాయ్ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స, వైద్యుల నిరంతర పర్యవేక్షణతో క్రమంగా యువకుడి ఆరోగ్యం కుదుటపడగా.. శుక్రవారం(13 మార్చి 2020) అతను పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
బాధితుడికి జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి రాగా.. న్యూమోనియా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో నమూనాలు తీసి గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. నెగెటివ్ అని తేలింది. 48 గంటల తర్వాత నమూనాలు సేకరించి మళ్లీ పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అక్కడినుంచి నివేదిక నెగెటివ్ అని రావడంతో అతను పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఆస్పత్రిలో చేరిన 13 రోజుల తర్వాత అతడు డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లేవని గాంధీ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కరోనా సోకిన వారందరూ చనిపోరని చెప్పారు. కరోనా వచ్చినంత మాత్రాన భయపడిపోవద్దని రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తి ఏ జబ్బువచ్చినా తట్టుకుంటాడని చెబుతున్నారు.
Also Read | అమెరికాలో ఎమర్జెన్సీ..కరోనా కట్టడికి 50 బిలియన్ డాలర్లు ప్రకటించిన ట్రంప్