శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 12:38 PM IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

Updated On : October 5, 2019 / 12:38 PM IST

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కట్ల బరువు 4.9 కేజీలు ఉంది. వాటి విలువ దాదాపు రెండు కోట్లు ఉందని చెప్పారు. దుబాయ్ విమానంలో వచ్చిన ముగ్గురి నుంచి 42 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేసి, వారి నుంచి మరిన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. 

దుబాయి నుంచి శంషాబాద్‌లో ల్యాండ్ అయిన ఎమిరేట్స్ విమానం నుంచి దిగిన ముగ్గురు ప్రయాణికులు అనుమానంగా కన్పించడంతో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని, విచారించగా.. వారి నుంచి టేప్‌తో చుట్టిన రెండు ప్యాకెట్లు లభించాయి. అందులో 42 ఫారిన్ మార్క్ కలిగిన బంగారు బిస్కెట్లు లభించాయి. ముగ్గురు ప్రయాణికులు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. 

అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. అనుమానితుల దగ్గర బంగారం కొన్నట్లుగా గానీ, దిగుమతి చేసుకుంటున్నట్లుగా గానీ ఎలాంటి ధృవ పత్రాలు లేవు. వారు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ 1962 కింద ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు.