ఏం చెబుతారో? : ఆర్టీసీ సమ్మె..హైకోర్టులో మళ్లీ విచారణ

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 12:21 AM IST
ఏం చెబుతారో? : ఆర్టీసీ సమ్మె..హైకోర్టులో మళ్లీ విచారణ

Updated On : October 18, 2019 / 12:21 AM IST

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు పనిచేయలేదు. న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు చర్చలు జరపడం సాధ్యంకాలేదు. ఇటు… ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు పంతాన్ని వీడకపోవడంతో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం కోర్టుకు నివేదిక అందించనున్న దృష్ట్యా ఇరుపక్షాలు ఎలాంటి వాదనలు వినిపిస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిల్‌పై కొనసాగిన వాదనల సమయంలో హైకోర్టు పలు సూచనలు చేసింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలంటూ కార్మిక సంఘాలకు… సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ప్రభుత్వానికి సూచించింది. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. రెండు వైపుల నుంచి చర్చల దిశగా అడుగులు పడలేదు. ఆర్టీసీ జేఏసీ.. తాము చర్చలకు సిద్ధమేనన్న ప్రకటనలకే పరిమితం కాగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైనే దృష్టిపెట్టింది. 

సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నట్టేనని, చర్చల ప్రసక్తే లేదని గతంలోనే తేల్చిచెప్పిన సీఎం… హైకోర్టు ధర్మాసనం ముందు ప్రభుత్వ వాదనలు బలంగా ఉండాలని అదనపు అడ్వకేట్ జనరల్‌కు సూచించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి వివరించాలని… సమ్మెకు దారితీసిన పరిస్థితులు, కార్మిక సంఘాల వైఖరిని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ఐఏఎస్‌లతో వేసిన త్రిసభ్య కమిటీ… కార్మిక సంఘం నేతలతో చర్చించిందని, నేతలు దిగిరాలేదన్న విషయాన్ని వివరించాలని చెప్పారు. సంప్రదింపులు ముగియక ముందే కార్మికులు సమ్మెకు వెళ్లారనే విషయాన్ని కోర్టు దృష్టికి తేవాలన్నట్లు సమాచారం. అంతేకాదు.. ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయని సిబ్బందిని విధుల్లో కొనసాగించలేమన్న అంశాన్ని కూడా చెప్పాలని సూచించారని తెలుస్తోంది.

మరోవైపు… ఆర్టీసీని విలీనం చేస్తేనే సమ్మెను విరమిస్తామంటున్న కార్మిక సంఘాలు… చర్చలకు తాము సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఆహ్వానించలేదని వాదనలు వినిపించబోతున్నాయి. కోర్టు ఆదేశాలను తాము హుందాగా తీసుకున్నామని… చర్చలకు పిలిస్తే వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నా ప్రభుత్వమే చొరవ తీసుకోలేదని చెప్పే అవకాశం ఉంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదని…కోర్టు ఆదేశించినా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని.. ఇందులో తమ తప్పేమీ లేదని కోర్టుకు విన్నవించబోతోంది. కోర్టు ఏం చెబుతుందోనన్నదే ఇపుడు హాట్ టాపిక్…సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.