హైదరాబాద్‌లో రోడ్లపైకి వస్తే క్రిమినల్ కేసులు, వాహనాలు సీజ్
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. వాహనాలపై తిరుగుతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో వాహనదారులు కనిపిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వర్గాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. లాక్ డౌన్ ను మరింత స్ట్రిక్ట్ చేసే పనిలో పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
రోడ్డెక్కితే క్రిమినల్ కేసులు, వాహనాలు సీజ్:
ఇందులో భాగంగా అనవసరంగా, సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తే క్రిమినల్ కేసులు పెడతామని, వాహనాలు సీజ్ చేస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సోమవారం(మార్చి 23,2020) సాయంత్రం మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనార్.. నగరవాసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. క్యాబ్ లు నడిపిస్తే డ్రైవర్లపై కేసులు పెడతామన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పకుండా హోం క్వారంటైన్ లో ఉండాలన్నారు. అన్ని చోట్ల ప్రజా రవాణ వ్యవస్థ నిలిచిపోయిందని, చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ప్రజలు ప్రయాణాలు మానుకుని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీపీ సూచించారు. మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలు గుంపులుగా తిరగొద్దన్నారు.
నిత్యవసరాల కోసం కూకట్ పల్లి వ్యక్తి గచ్చిబౌలి వస్తే ఎలా?
రోడ్డుపైకి ఎందుకు వచ్చారని అడిగితే నిత్యవసరాల కోసం అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని, ఇది కరెక్ట్ కాదని సీపీ అన్నారు. కూకట్ పల్లిలో నివాసం ఉండే వ్యక్తి నిత్యవసరాల కోసం గచ్చిబౌలి వస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నిత్యవసరాల కోసం ప్రజలు తమ ఇళ్ల దగ్గరలోనే ఉన్న దుకాణాలకు వెళ్లాలని సీపీ సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు సీపీ సజ్జనార్.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్:
మంగళవారం(మార్చి 24,2020) నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోతాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలని ఈటల కోరారు. రానున్న 10 రోజులు రాష్ట్రానికి చాలా కీలకమన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పారు. నిత్యవసర సేవలు, దుకాణాలు తెరిచే ఉంటాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంట్లో నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటికి రావాలని మంత్రి సూచించారు.
తెలంగాణలో 33కి చేరిన కరోనా కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020) ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33కి చేరింది. మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయాన్ని తెలిపారు. బాధితులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక్కరు కూడా వెంటిలేటర్ పై లేరని మంత్రి ఈటల తెలిపారు. 97 అనుమానిత కేసులు ఉన్నాయన్న మంత్రి, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.
బతికుంటే బలుసాకు తినొచ్చు:
బతికుంటే బలుసాకు తినొచ్చన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కు పిలుపునిచ్చారని మంత్రి ఈటల చెప్పారు. మార్చి 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, వైరస్ బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా రాకుండా ఇంటికొకరు చొప్పున నిత్యవసరాల కోసం బయటకు రావాలని మంత్రి కోరారు.