మహిళా కానిస్టేబుల్‌కి సైబర్ క్రిమినల్స్ టోకరా

నగరానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌కు సైబర్ నేరగాళ్ళు టోకరా పెట్టారు. పెళ్లి కోసం దాచుకున్న డబ్బును డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఆమెకు విషయం తెలిసి షాక్ అయ్యారు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బుధవారం నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళిన ఆమెకు డబ్బు కాజేసిన విషయం తెలిసింది.
బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివసించే పోలీసు కానిస్టేబుల్‌కు ఆంధ్రా బ్యాంక్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఉన్నాయి. గూగుల్ పే అకౌంట్‌కు ఆంధ్రా బ్యాంక్ అకౌంట్‌ను లింకు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌ను తన గూగుల్ పేలో బెనిఫిషియరీగా జత చేసుకున్నారు.
అవసరమైన సందర్భాల్లో గూగుల్ పే ద్వారా ఆంధ్రా బ్యాంక్‌లో ఉన్న నగదును బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి మార్చుకుంటూ ఉండేంది. గత నెలలో ఇలాగే రూ.10 వేలు, మంగళవారం రెండు దఫాల్లో రూ.80 వేలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి బదిలీ చేశారు. శుక్రవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి బదిలీ చేసిన రూ.90 వేలు డ్రా చేసుకోవాలని భావించారు.
బుధవారం బ్యాంకుకు వెళ్లేసరికి అందులో డబ్బుల్లేవని తెలిసింది. గూగుల్ పేలో బెనిఫిషియరీగా యాడ్ చేసుకున్న ఖాతాకు పంపిన నగదు మాయం కావడంతో ఆమె మోసపోయానని తెలుసుకుంది. గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ కానిస్టేబుల్ గూగుల్ పేలో బెనిఫిషియరీగా యాడ్ అయిన ఖాతా వివరాలు ఎస్‌బీఐకి చెందినవిగా తేలాయి.
ఖాతా వివరాలకు ఆమె పేరుతోనే డిస్‌ప్లే నేమ్ సృష్టించి, దీన్ని బెనిఫిషియరీగా గూగుల్ ఖాతాలో యాడ్ చేశారు. అంతకుముందే యాడ్ అయి ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాను డిలీట్ చేశారు. డిస్‌ప్లే నేమ్‌గా ఆమె పేరే కనిపిస్తుండటంతో బాధితురాలికి అనుమానం రాలేదు. మొత్తంగా బదిలీ చేసిన రూ.90 వేలు మోసపోయారు.
Also Read | ఆదివారం పనిచేయకపోయినా జీతాలివ్వండి: మోడీ