హైదరాబాద్ ను వణికిస్తున్న డెంగ్యూ

హైదరాబాద్ మహనగరంలో డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 8 రోజుల వ్యవధిలో 109 మంది డెంగ్యూ వ్యాధితో గాంధీ ఆస్ప్రత్రిలో చేరటమే వ్యాధితీవ్రతకు కారణంగా చెప్పవచ్చు. 471 మందికి బ్లడ్ టెస్ట్ లు చేయగా వారిలో ఎక్కువ మందికి డెంగ్యూ వ్యాధి ఉన్నట్లు తేలింది. సగటున రోజుకు 13 మంది డెంగ్యూ బాధితులు గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఉస్మానియాలోనూ అదే పరిస్ధితి.
సోమవారం సెప్టెంబరు 9, ఒక్క రోజే ఏడుగురు డెంగ్యూ బాధితులు ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. 2019 జనవరి నుంచి సెప్టెంబరు 8 వరకు 560 మంది డెంగ్యూ బాధితులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఉస్మానియా ఆస్పత్రిలో గత 3 నెలల్లో 300 మంది చేరారు. ఇవికాక నిమ్స్, ఇతర ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రిలో కనీసం 40-60 మంది వరకు జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 70 శాతం మందిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 2019 లో 874 మంది డెంగ్యూ వ్యాధి లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చారు. వీరికి రక్తపరీక్షలు నిర్వహించగా… ఏకంగా 232 మందికి డెంగ్యూ ఉన్నట్లు తేలింది. డెంగ్యూ మాత్రమే కాదు గన్యా, మలేరియా జ్వరాలు కూడా నగరంలో విజృంభిస్తున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో 83 మంది గన్యాతో గాంధీ ఆసుపత్రిలో చేరారు.