విజృంభిస్తున్న డెంగీ : బాబోయ్ బొప్పాయ్

డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బొప్పాయ్ ధర చుక్కలు చూపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే..దిగుబడిలో తేడా లేదు..కానీ..ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 70 నుంచి రూ. 80 వరకు అమ్ముతున్నారు. సేమ్..గత సంవత్సరం కాలంలో రూ. 25 నుంచి రూ. 30 వంతున బొప్పాయిని అమ్మారు. జ్వరాల సీజన్‌లో దొరికిందే అవకాశంగా బొప్పాయి పండు ధరను కూడా వ్యాపారులు అందుబాటు లేకుండా చేస్తున్నారని అంటున్నారు.
వివిధ జిల్లాల నుండి గడ్డి అన్నారం మార్కెట్‌కు బొప్పాయి అధికంగా వస్తుంటుంది. ప్రతి రోజు 40 నుంచి 45 టన్నుల పండ్లు వస్తున్నాయని, వీటిని హోల్ సేల్ మార్కెట్లో కమిషన్ ఏజెంట్లు కిలో రూ. 25 నుంచి రూ. 30కి కొంటున్నారని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అక్కడి నుంచి చిరు వ్యాపారులు చేతికి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతోంది. ఒకేసారి రూ. 70 దాటి అమ్మేస్తుండడంతో జేబుకు చిల్లు పడుతోంది. దీనిని తినడం వల్ల రక్త కణాలు వృద్ధి చెందుతాయనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నగరాన్ని జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ ఫీవర్ విజృంభిస్తోంది. ప్రధాన ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దోమకాటు కారణంగా వచ్చే వ్యాధితో రక్తంలో ప్లేట్ లెట్లు బాగా పడిపోతాయి. ప్లేట్ లెట్లు పెరిగేందుకు బొప్పాయి పండు..దీని ఆకు రసం బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతుంటారు. ఇదే అదనుగా ధరలు పెంచేస్తున్నారు. ఇతర పండ్ల ధరలు కూడా అలాగే ఉన్నాయి. కొబ్బరి బొండాం, ఆపిల్ ధరలు కూడా అధికంగా ఉంటున్నాయి.