టాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం

  • Published By: chvmurthy ,Published On : November 20, 2019 / 08:25 AM IST
టాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం

Updated On : November 20, 2019 / 8:25 AM IST

టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ  అధికారులు చేస్తున్న సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రముఖ నిర్మాతలు, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్‌ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో ‘విక్టరీ’ వెంకటేష్ నివాసంలోనూ  సోదాలు చేస్తున్నారు. పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఉన్న వెంకటేష్ నివాసంలో ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. హీరోల ఆడిటర్లను దగ్గర ఉంచుకుని అధికారులు ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు.

సినిమా నిర్మాణాలకు సంబంధించిన ఆదాయ వ్యయాలు వార్షిక ఆదాయాల్లో లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాలపై మీడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని, ఇవన్ని సాధారణంగా జరిగే తనిఖీలేనని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.