ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రుల సమావేశం: అజెండా ఇదే

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇవాళ(23 సెప్టెంబర్ 2019) సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చిస్తారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రులు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో వీరిద్దరి భేటి జరగనుంది. రెండు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొంటారు.
వరద నీటిని వృధాగా సముద్రంలోకి వదలడం కంటే సద్వినియోగం చేసుకుని కరవు ప్రాంతాల్లో నీటి కష్టాలు తీర్చాలనే విషయాన్ని ముఖ్య అజెండాగా సీఎంలు భావిస్తున్నారు. విభజన సమస్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి పంపకాలకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే సీఎంలకు అందజేశారు ఇరు రాష్ట్రాల అధికారులు. పోలవరం అంశం కూడా సీఎంల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా జగన్, కేసిఆర్ రెండు సార్లు భేటి కాగా.. ఇవాళ ముచ్చటగా మూడోసారి.