శాసనమండలి ఎన్నికల సందడి
తెలంగాణలో శాసనమండలిలోని ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి.

తెలంగాణలో శాసనమండలిలోని ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు శాసనమండలి ఎన్నికల సందడి నెలకొంది. శాసనమండలిలోని ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే వీటిని నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఖాళీలపై నివేదిక పంపాలని రాష్ట్ర అధికారులను కోరింది. ప్రస్తుతం 7 స్థానాలు ఖాళీ కాగా మార్చి నెలాఖరుకు మరో 9 ఖాళీ కానున్నాయి. వాటిలో 15 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. గవర్నర్ కోటాలో మరో స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది.
ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పాతూరి సుధాకర్‌రెడ్డి, పి.రవీందర్, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-ఖమ్మం జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కె.స్వామిగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీకాలం మార్చి నెలతో ముగియనుంది.
ఇవి కాకుండా మిగిలిన 12 స్థానాలకు కలిపి ఒకేదఫా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 20న ప్రకటించనుంది. తరువాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.