తెలంగాణలోనే తొలిసారి: కంప్లైంట్ చెయ్యాలంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లక్కర్లేదు

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఏదో తెలియని భయం ఇంకా జనాల్లో ఉంది. అటువంటి భయం నుంచి విముక్తి కలిగిస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. తమ ప్రాంతానికి వచ్చే పెట్రోకార్ (పెట్రోలింగ్ మొబైల్) సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చాలు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ జారీ చేస్తారు.
ఈ మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో ఇటువంటి విధానం అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అన్ని జోన్ల ఉన్నతాధికారులకు ఆదేశాలు విడుదల చేసింది పోలీసు శాఖ. సాధారణంగా పౌరులు ఫిర్యాదు చేయాలంటే.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిందే. ఆ సమయంలో ఫిర్యాదును స్వీకరించే రైటర్ గానీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గానీ అందుబాటులో లేకుంటే.. వారు వచ్చేదాకా ఎదురు చూడాలి.
మళ్లీమళ్లీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగుతూనే ఉండాలి. ఇకపై హైదరాబాదీలకు ఆ ఇబ్బందులు ఉండబోవని అంజనీకుమార్ తెలిపారు. ‘‘ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్రోకార్ అధికారులను ప్రకటించాం. ఎక్కడ ఏ నేరం జరిగినా.. ముందు చేరుకునేది పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది మాత్రమే. వారి వల్లే విజిబుల్ పోలీసింగ్ పెరుగుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విస్తృతమవుతోంది. ప్రజలతో ఎక్కువ శాతం ప్రత్యక్ష సంబంధాలు ఉండేది వారికే. అందుకే.. వారికి ఫిర్యాదును స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అధికారాలిచ్చాం’’ అని ఆయన వివరించారు.