మెట్రో ప్యాసింజర్స్‌కు గుడ్ న్యూస్ : అందుబాటులో మాదాపూర్ స్టేషన్

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 02:02 AM IST
మెట్రో ప్యాసింజర్స్‌కు గుడ్ న్యూస్ : అందుబాటులో మాదాపూర్ స్టేషన్

మాదాపూర్ మెట్రో రైలు స్టేషన్ ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ స్టేషన్‌ ఇక ఉపయోగించుకోవచ్చు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి మెట్రో రైలు ఆగుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో మాదాపూర్ స్టేషన్‌లో మెట్రో ఆగడం లేదనే విషయం తెలిసిందే. మార్చి 20వ తేదీన అమీర్ పేట – హైటెక్ సిటీ మెట్రో ప్రారంభమైంది.

హైటెక్ సిటీలో మెట్రో ట్రాక్ మారేందుకు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో వెళ్లిన ట్రాక్‌లోనే తిరిగి వచ్చి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు స్టేషన్‌లో ట్రాక్ మారుతోంది. రివర్సల్ పూర్తయ్యే వరకు ఇలాగే ట్విన్ సింగిల్ లేన్‌లో మెట్రో నడపనున్నారు. మే నెలాఖరులోగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని, అప్పటిలోగా హైటెక్‌ సిటీ వద్ద మెట్రో రైలు రివర్సల్‌ పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. నాగోల్‌ – హైటెక్‌ సిటీ,ఎల్బీనగర్‌ – మియాపూర్‌ మార్గంలో నిత్యం 2.30 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని HMR MD ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. 

అమీర్, పేట- హైటెక్ సిటీ మార్గం మొత్తం 10 కిలోమీటర్లుగా ఉంది. మధురా నగర్, యూసుఫ్ గూడ, జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటి వంటి ముఖ్యమైన 8 ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ కారిడార్ విస్తృతంగా అభివృద్ధి చెందింది. అత్యంత రద్దీగా వుండే హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.