తెలంగాణ, ఆంధ్రా పై బండ వేసిన మర్కజ్ మసీద్

దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ మత ప్రార్ధనలతో సంబంధం ఉండటమే దీనికి నిదర్శనం. ఇప్పడు దేశంలో అందరి దృష్టి నిజాముద్దీన్ మర్కజ్ మసీదుపైనే ఉంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చి22న జనతా కర్ఫ్యూ విధించారు. అనంతరం పరిస్ధితిని సమీక్షించిన ప్రధాని… వైరస్ తీవ్రత పెరుగుతూ ఉండటంతో మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ లాంటిదే. ప్రజలెవరూ ఇళ్ళనుంచి బయటకు రాకుండా లక్ష్మణ రేఖ గీసుకుని ఇంట్లోనే ఉండమని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 14 నాటికి దేశంలో పరిస్ధితులు చక్కబడి..ప్రజలంతా తిరిగి ఎవరి పనులు వారు చేసుకోవచ్చని భావిస్తున్న తరుణంలో నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు లో జరిగిన మత ప్రార్ధనల ఉదంతంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అక్కడ జరిగిన మత ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారిలో ఎక్కువ శాతం మందికి కరోనా వైరస్ సోకటంతో ఇప్పుడు కలవరం మొదలైంది.
గత 3 రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. వీరిలో నిజాముద్దీన్ మత ప్రార్ధనలకు వెళ్ళిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇంతకు ముందు వరకు విదేశాలనుంచి స్వదేశానికి చేరుకున్న వారిలో మాత్రమే పాజిటివ్ కేసులు బయట పడేవి. ఇప్పుడు ఈ మత ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారిలో అత్యధికులకు వ్యాధి సోకటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతలోని మర్కజ్ మసీదు..మార్చినెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు జరిగాయి. ఆ ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి ప్రజలు హాజరయ్యారు. మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు వచ్చారు. అలా వచ్చిన వారు వైరస్ ని…. ప్రార్థనలకు హాజరైన వారికి అంటించారు. ప్రార్థనలు ముగిశాక ఎవరి స్వస్థలాలకు వాళ్లు వెళ్లిపోయారు. అలా ఒకరినుంచి మరోకరికి కరోనా వైరస్ సోకింది. వారిలో ఒక్క తెలంగాణలోనే ఆరుగురు ఇటీవల మృతి చెందారు. ఆ ఆరుగురే కాక రాష్ట్రంలో కరోనా సోకిన వారు ఇంకెందరో ఉన్నారు
తెలంగాణ రాష్ట్రం నుంచి 380 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్లు తేలింది. హైదరాబాద్ 186, నిజామాబాద్ 18, మెదక్ 26, నల్గొండ 21, ఖమ్మం 15, ఆదిలాబాద్ 10, రంగారెడ్డి 15, వరంగల్ 25, కరీంనగర్ 17,మహబూబ్ నగర్ 25, భైంసా 11, నిర్మల్ 11 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి….. 711 మంది వెళ్ళారు. వీరిలో విజయనగరం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం రూరల్‌లో ఒక్కరు, విశాఖపట్నం సిటీలో 41 మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది, రాజమండ్రిలో 21 మంది, కృష్ణా జిల్లాలో 16 మంది, విజయవాడ సిటీలో 27 మంది, గుంటూరు అర్బన్‌లో 45 మంది, గుంటూరు రూరల్‌లో 43 మంది. ప్రకాశం జిల్లాలో 67 మంది, నెల్లూరు జిల్లాలో 68 మంది, కర్నూల్ జిల్లాలో 189 మంది, కడప జిల్లాలో 59 మంది, అనంతపూర్ జిల్లాలో 73 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, తిరుపతికి చెందిన 16 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు. వీరిలో అధిక శాతం మంది ఐసో లేషన్ లో ఉండటానికి ఇష్టపడటం లేదు. కనీసం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు కూడా చేయించుకోకుండా నిమ్మకు నీరెత్తి నట్లు కూర్చోవటంతో వీరిని గుర్తించి పరీక్షలు చేయించేందుకు ప్రభుత్వం యత్నాలు చేస్తోంది
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాతి రోజే పోలీసులు మర్కజ్ మసీదు మత పెద్దలను పిలిచి వారికి పరిస్ధితిని వివరించారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇందుకు మత పెద్దలు ససేమిరా అన్నారు. రెండువేల మందికి పైగా ఉన్న మర్కజ్ భవనాన్ని తాము సగం వరకు ఖాళీ చేయించామని, ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే ఉన్నారంటూ మత పెద్దలు సమాధానం చెప్పారు.
మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొనడానికి వెయ్యిమందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ.. రెండువేల మందికి పైగా హాజరయ్యారనే సమాచారం తమ వద్ద ఉందని ఎస్‌హెచ్ఓ ముఖేష్ వలియాన్ మత పెద్దలకు స్పష్టం చేశారు. భవనాన్ని ఖాళీ చేయకపోతే తామే ఆ పని చేయాల్సి ఉంటుందని, అక్కడిదాకా పరిస్థితిని తీసుకుని రావొద్దంటూ ఆయన సూచించారు. అయినప్పటికీ- మర్కజ్ మత పెద్దలు పట్టించుకోలేదు. దాని ఫలితంగా దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా పెరగడానికి కారణమైందని చెబుతున్నారు.
ఇప్పడు దేశవ్యాప్తంగా మర్కజ్ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చినవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి..వారిలో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నవారికి ట్రీట్ మెంట్ ఇచ్చి, తిరిగి వారికి నెగెటివ్ వచ్చేంతవరకు లాక్ డౌన్ ఎత్తేసే సూచనలు కనపడటం లేదు.