నుమాయిష్‌లో మంటలు : అసలు ఏం జరిగింది

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 12:51 AM IST
నుమాయిష్‌లో మంటలు : అసలు ఏం జరిగింది

Updated On : January 31, 2019 / 12:51 AM IST

హైదరాబాద్ : అప్పటి వరకు సందడిగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్.. బూడిద దిబ్బగా ఎలా మారింది? ఈ ప్రమాదానికి షార్ట్ సర్కూటే కారణమా? గ్యాస్ సిలిండర్లు పేలాయంటున్న ప్రత్యక్ష  సాక్ష్యులు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అసలేం జరిగింది? ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జనవరి 1న ప్రారంభమైన 79వ పారిశ్రామిక ప్రదర్శన 23 ఎకరాల్లో 2900 స్టాళ్లతో ఏర్పాటు చేశారు. జైళ్లు, అటవీశాఖలతో పాటు దేశం నలుమూలల నుంచి వర్తకులు ఇక్కడకు వచ్చి వస్త్రాలు, ఇతర వస్తువులను అమ్ముతుంటారు. జమ్మూకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుండి చేతివృత్తి కళాకారుల రూపొందించే వస్త్రాలు, కళాఖండాలకు సంబంధించి స్టాళ్లు ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చే జనం.. తమకు కావాలసినవి కొనుక్కుంటూ ఉంటారు. ఫిబ్రవరి 15 వరకు సాగే ఈ ఎగ్జిబిషన్‌ను సుమారు 25 నుంచి 30లక్షల మంది సందర్శిస్తారు. 

ఎప్పటిలాగే.. జనవరి 30వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. అయితే.. సాయంత్రం 8.30 గంటల ప్రాంతంలో వనితా మహావిద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన జైళ్లు, ఆంధ్రాబ్యాంక్‌ స్టాళ్ల సమీపం నుంచి మంటలు మొదలయ్యాయి. సందర్శకులు, స్టాళ్ల యజమానులు చూస్తుండగానే.. ఈ మంటలు గాంధీ విగ్రహం సమీపంలోని హెచ్‌పీ గ్యాస్, పిస్టా హౌజ్‌ స్టాళ్ల మధ్య, వీటికి ఎదురుగా ఉన్న స్టాళ్లకు వ్యాపించాయి. 

చేనేత, దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల స్టాళ్లే ఎక్కువగా ఉండటంతో.. మంటలు శరవేగంగా వ్యాపించాయి. జైళ్లు, ఆర్బీఐ, ఆంధ్రాబ్యాంక్, రియల్‌ ఎస్టేట్‌ స్టాళ్లన్నీ దగ్ధమయ్యాయి. కశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి స్టాళ్లలోని మినీ గ్యాస్‌ సిలిండర్లు పేలాయని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. 
స్టాళ్లలోని వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే నష్ట తీవ్రత పెరిగిందని వ్యాపారులు ఆరోపించారు. కళ్ల ముందే లక్షల రూపాయల ఆస్తి బుగ్గి పాలు కావడంతో.. వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.