మిషన్ 16 : కేసీఆర్ స్పెషల్ ఫోకస్

  • Published By: madhu ,Published On : March 24, 2019 / 12:41 PM IST
మిషన్ 16 : కేసీఆర్ స్పెషల్ ఫోకస్

Updated On : March 24, 2019 / 12:41 PM IST

మిషన్ 16.. ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే.. కొత్తగా 9మంది లోక్‌సభ బరిలోకి దిగుతుండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కొత్తవారికి సీట్లిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సగానికి పైగా స్థానాల్లో కొత్త అభ్యర్థులను పోటీలోకి దింపారు కేసీఆర్. రాజకీయంగా అనుభవం లేకపోవడం.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని రంగంలోకి దింపిన గులాబీ బాస్… వారి విజయం కోసం వ్యూహలు రచిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా 16 సీట్లను అత్యధిక మెజారిటీ గెల్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా పరిస్థితిని కేసీఆర్ సమీక్షిస్తున్నారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా జిల్లాల మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించారు. 

గెలుపు బాధ్యతలు ఎవరెవరికి : –
మహబూబ్‌నగర్‌లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపు బాధ్యతలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.
నాగ‌ర్ క‌ర్నూల్‌లో మాజీ మంత్రి రాములు గెలుపు బాధ్యతలు మంత్రి నిరంజ‌న్ రెడ్డి.
చేవెళ్లలో రంజిత్‌రెడ్డి గెలుపు బాధ్యతలు మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి. 
మ‌ల్కాజిగిరిలో రాజశేఖ‌ర్ రెడ్డి గెలుపు బాధ్యతలు మంత్రి మ‌ల్లారెడ్డి. 
నల్గొండ పార్లమెంట్ నుంచి రియల్టర్ వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపు బాధ్యతలు మంత్రి జగదీష్‌రెడ్డి. 
మహబూబాబాద్‌లో మాలోతు కవిత గెలుపు బాధ్యతలు మంత్రి ఎర్రబెల్లి. 
పెద్దప‌ల్లి ఎంపీ అభ్యర్థి వెంక‌టేశ్ నేతకాని గెలుపు బాధ్యతలు మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బాల్కసుమన్‌. 

ఖమ్మం విషయంలో మాత్రం అధినేత కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు. ఖమ్మంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. కొందరు నేతలు పార్టీ మారే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే.. పార్టీ అభ్యర్థికి సహకరించకపోవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో.. ఖమ్మంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యలను స్వయంగా కేసీఆర్ తీసుకున్నారు.