గమ్‌ లిక్విడ్‌ : పిల్లలను చంపేస్తున్న మత్తుమందు

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 01:46 PM IST
గమ్‌ లిక్విడ్‌ : పిల్లలను చంపేస్తున్న మత్తుమందు

Updated On : August 27, 2019 / 1:46 PM IST

గజగజలాడించే గంజాయి.. మత్తులో ముంచేసే ఇంజక్షన్లు.. హడలెత్తించే డ్రగ్స్‌.. అన్నీ అయిపోయాయి. మార్కెట్‌లోకి కొత్త మత్తు మందులు వచ్చాయి. మనకు తెలిసిన, అందరూ వాడే పదార్ధాలే నిషా వస్తువులుగా మారాయి. విద్యార్థులను, చిన్నారులను ఊబిలోకి లాగి బానిసలుగా మారుస్తున్నాయి. నిషాలో ముంచి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో కర్చీఫుల్లో మత్తును నింపుకొని మాయలోకంలో విహరిస్తున్నారు చిన్నారులు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

వీధి బాలలు మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఆకలి తీర్చుకునే దారి తెలియక.. మత్తు మందును ఆశ్రయిస్తున్నారు. ఆకలిని చంపుకోవడానికి కొత్త దారులు వెతుకుతూ.. మత్తును పీలుస్తూ వ్యసనపరులుగా మారుతున్నారు. కడుపు మంటను చల్లార్చుకోవడానికి మత్తు భూతానికి చేరువవుతున్నారు. తినడానికే తిండి లేని వారు.. గంజాయి, డ్రగ్స్‌లాంటివి కొనలేక.. నిషాను విడిచి ఉండలేక.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గమ్‌ లిక్విడ్‌ను కర్చీఫ్‌లో వేసుకొని పీలుస్తూ మత్తులో ఊగిపోతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని వీధి బాలలే కాదు.. విద్యార్థులు కూడా ఈజీగా దొరికే ఈ గమ్‌ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. తణుకు, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం లాంటి చిన్న పట్టణాలను ఈ గమ్ము మత్తే ముంచేస్తోంది. ఎక్కడ చూసినా పిల్లలు.. కర్చీఫ్‌ను పట్టుకొని పీలుస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముందుగా పార్కుల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో వీటిని అలవాటు చేసుకుంటున్న చిన్నారులు.. తర్వాత యదేచ్చగా ప్రజల మధ్యనే వాడేస్తున్నారు. ఎవరూ గుర్తించే అవకాశం లేకపోవడంతో.. జనసంచారంలోనే నిషాచరులుగా మారుతున్నారు.

సైకిల్‌ పంక్చర్‌కు వాడే లిక్విడ్‌, వైట్‌నర్‌, టిన్నర్‌, పాలిష్‌ లిక్విడ్‌, కొత్తగా ఫెవికల్‌ లిక్విడ్‌ ఇలా దొరికిన దానితో నిషాలోకి జారుకుంటున్నారు చిన్నారులు. పది పన్నెండేళ్లు నిండని పిల్లలు కూడా మత్తు కోసం పరితపిస్తున్నారు. అందుబాటులో ఉండే వస్తువులే కావడం.. వీటిపై నిషేధం లేకపోవడంతో సులువుగా ఆ లిక్విడ్స్‌ను పొందుతున్నారు. మత్తు లోకంలో విహరిస్తున్నారు.

ఇలాంటి లిక్విడ్స్‌ను తీసుకునే వారి జీవితం సర్వనాశనం అవుతుందంటున్నారు డాక్టర్లు. వీటికి అలవాటుపడిన వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని డాక్టర్‌ స్వరూప్‌ చెబుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇలా ఫెవికల్‌ గమ్ముకు అలవాటు పడుతున్నారని వాపోతున్నారు స్థానికులు. ఇలా మత్తుకు అలవాటు పడిన వారిని గుర్తించి చైల్డ్‌ వెల్ఫేర్‌ సొసైటీకి అప్పగించాలంటున్నారు.

బిచ్చగాళ్ల మాఫియా వల్లనే చిన్నారులు ఇలా మత్తుకు అలవాటు పడుతున్నారని అంటున్నారు ప్రజలు. నిషాలో నేరగాళ్లుగా మారుతున్నారని ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. భావితరం నేరమయమవుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న ప్రధానమైన పట్టణాల్లో చైల్డ్‌ లైన్‌ అధికారులు, పోలీసులు నిఘా పెట్టి చిన్నపిల్లలను ఆకలి మాటున మత్తుకు గురిచేస్తున్న బెగ్గింగ్‌ మాఫియా భరతం పట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. లేకపోతే ఎందరో అమాయక చిన్నారుల భవిష్యత్‌ అంధకారం అవుతుంది.