టీడీపీ నేత అరెస్ట్ : ఏపీ నుంచి తెలంగాణకు తరలింపు

కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మిగనూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న పరిశ్రమకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.12 కోట్లు బకాయి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనే తిక్కారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సోమవారం(అక్టోబర్ 21,2019) ఎమ్మిగనూరులో ఇంట్లో ఉండగా పోలీసులు తిక్కారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రూ.12కోట్ల బకాయిలు చెల్లించలేదని తిక్కారెడ్డిపై బేగంపేట పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఎమ్మిగనూరు వెళ్లారు. స్థానిక పోలీసుల సహకారంతో తిక్కారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే హైదరాబాద్ కి తరలించారు. తిక్కారెడ్డి అరెస్ట్ కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది.
తిక్కారెడ్డి అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కై రెండు రాష్ట్రాల్లోని తమ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తిక్కారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.