తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 02:31 AM IST
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

తెలంగాణలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా భరించలేని ఎండలు. సాయంకాలం ఊహించని వర్షాలు. వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. అంతేకాదు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు పడుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వరకు ఈదురుగాలు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. 

దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కిలో మీటరు ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోని కొనసాగుతోందని వెల్లడించింది.