ఆర్టీసీలో రికార్డు సమ్మె

  • Published By: madhu ,Published On : November 4, 2019 / 04:22 AM IST
ఆర్టీసీలో రికార్డు సమ్మె

Updated On : November 4, 2019 / 4:22 AM IST

సమస్యల పరిష్కరించండి..తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రికార్డు సృష్టించింది. సుదీర్ఘకాలంగా సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2001 నవంబర్‌లో జీతాలను సవరించాలని..తదితర డిమాండ్లతో కార్మికులు 24 రోజుల పాటు సమ్మె చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఆర్టీసీ కొన్నాళ్లు ఉమ్మడిగానే ఉంది. రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంగా 2014 సెప్టెంబర్‌లో ఆర్టీసీ కార్మికులు 28 రోజలు పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. 2015 మే నెలలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు.  

సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 8 రోజులకే సమ్మె ముగిసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..పలు డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31 రోజులు గడిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం ఇంత సుదీర్ఘంగా సమ్మె చేసిన దాఖలాలు లేవని కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. 

తెలంగాణలో సుమారు 48 వేలమంది కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో..ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కొంతమంది గుండెపోటుతో చనిపోయారు. సమ్మె చేస్తున్న కార్మికులకు సెప్టెంబర్ జీతాలు కూడా అందలేదు.

నవంబర్ 05వ తేదీలోగా విధుల్లోకి హజరు కావాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. ఆర్టీసీకి సమ్మెకు సంబంధించిన వ్యవహారం కోర్టు విచారిస్తోంది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నవంబర్ 07వ తేదీన విచారణ చేపట్టనుంది. నవంబర్ 05 డెడ్ లైన్..కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 
Read More : ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె