ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై కోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరిష్కారం చేసుకోవాలని సమయమిచ్చినా.. న్యాయస్థానం ఆదేశాలను పక్కన పెట్టేశారు. దీంతో.. కార్మికుల సమ్మెపై హైకోర్టులో కొన్నాళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో దాఖలవుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై కూడా కోర్టు విచారిస్తూ వస్తోంది. ప్రభుత్వ వాదనలపై.. కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి రాదని… ఇంకా ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోనే ఉందని కోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల.. ఎస్మా కింద ఎలాంటి ఆదేశాలివ్వలేమని తెలిపింది. ఆర్టీసీ అత్యవసర సేవ అని జీవో జారీ చేస్తేనే.. ఎస్మా కిందకు వస్తుందని కోర్టు చెప్పింది. అలా.. జీవో లేనందున.. ఆర్టీసీ ఎస్మా కిందని రాదని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 39వ రోజుకు చేరింది. రోజూ ప్రభుత్వానికి నిరసనలు తెలుపుతున్నా సమ్మె మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రోజుకో విధంగా ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతూ డిమాండ్స్‌ను పరిష్కరించాలని కోరుతున్నారు. కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిరసనల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.
మరో వైపు తమ డిమాండ్ల నెరవేర్చుకునేందుకు, కార్మికుల సమస్యలను వివరించేందుకు.. ఆర్టీసీ జేఎసీ నేతలు మంగళవారం నవంబర్ 12న గవర్నర్ తమిళసైని కలవనున్నారు. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున.. ఇవాళ్టి నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కోర్టు తీర్పు తర్వాతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.