కూలీలుగా మారిన ఆర్టీసీ కార్మికులు : స్టీరింగ్ పట్టాల్సిన చేతులు..గరిటె తిప్పుతున్నాయి
ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను కకావికలం చేస్తోంది. బెట్టు వీడని సర్కార్.. దూకుడు మీదున్న ఆర్టీసీ జేఏసీ వెరసి కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.

ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను కకావికలం చేస్తోంది. బెట్టు వీడని సర్కార్.. దూకుడు మీదున్న ఆర్టీసీ జేఏసీ వెరసి కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను కకావికలం చేస్తోంది. బెట్టు వీడని సర్కార్.. దూకుడు మీదున్న ఆర్టీసీ జేఏసీ వెరసి కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. జీతాలు రాక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితిలో రోజువారీ కూలీలుగా మారుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం ఇది. వారి వేదనేంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను ఆగమాగం చేస్తోంది. నెలన్నరగా కార్మికులు అనుభవిస్తున్న మానసిక వేదనను చెప్పడానికి ఎన్ని పదాలైనా చాలవు. నెల జీతం రాలేదు.. ఉన్న అరకొర సొమ్ములు సమ్మె సమయంలో కరిగిపోయాయి. పిల్లల చదువులని కొందరు.. కుటుంబపోషణ భారమై ఇంకొందరు.. వృద్ధ తల్లిదండ్రుల బాధ్యతలు భుజాలపై మోపై మరికొందరు.. ఏం చేయాలో తెలియని పరిస్థితి.. ఎటుపోవాలో పాలుపోని దుస్థితి. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోజువారీ కూలీలుగా అవతారమెత్తుతున్నారు ఆర్టీసీ కార్మికులు.
ఉద్యోగంలో చేరకముందు నేర్చుకున్న హస్తకలలను ఇప్పుడు బయటకు తీస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. పొట్టకూటి కోసం మొహమాటం వీడి మళ్లీ పాత పనులనే ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది పూట గడిస్తే చాలనుకుంటూ.. ఏ పనిపడితే ఆ పని చేస్తూ…కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సమ్మె ఎప్పుడు ముగిసిద్దో తెలియదు.. సర్కార్ తమ డిమాండ్లు ఒప్పుకునే పరిస్థితీ కనిపించడం లేదు.. దీంతో.. వచ్చినకాడికి చాలనుకుంటూ పొట్టపోసుకుంటున్నారు.
మొన్నటిదాకా.. షిఫ్ట్‌లవారీగా పనిచేసిన ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు ఏదైనా పనిదొరికితే చాలు అనుకునే పరిస్థితికి దిగజారారు. పూట గడిస్తే చాలనే దుస్థితిలో బతుకీడుస్తున్నారు. సుమారు నెలన్నర రోజులు.. ఆర్టీసీ కార్మికులకు ఉపాధి కరువై.. సమ్మె మొదలై. అంతకుముందు రావాల్సిన నెలజీతం రాక బతుకు దుర్భరమై. వీటికితోడు ఎన్నో కమిట్‌మెంట్లు.. మరెన్నో ఇన్‌స్టాల్‌మెంట్లు.. అన్నీ వెరసి ఆర్టీసీ కార్మికులను రోజువారీ కూలీలుగా మార్చేశాయి.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిసర ప్రాంతంలో సుమారు వందమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కార్మికుల తమ డిమాండ్ల కోసం కొన్నిరోజులుగా సమ్మె చేస్తున్నారు. ఐతే.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడ పట్టువిడవడం లేదు. మరోవైపు కార్మికులు జీతాలు రాక.. చేతిలో చిల్లిగవ్వలేక దుర్భరమైన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో పలువురు కార్మికులు కూలీలుగా అవతారమొత్తారు. తమ డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తూనే వారికి వచ్చిన పనికి కూలీలుగా వెళ్తూ ఇళ్లు గడుపుకుంటున్నారు.
కాగజ్‌నగర్‌లోని కాపువాడకు చెందిన సీహెచ్ రామయ్య ఆర్టీసీ కండక్టర్. మంచిర్యాల డిపోలో పనిచేసేవాడు. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నాడు. మూడు నెలలుగా జీతం రాకపోవడంతో అయనకు తెలిసిన వారి డెయిరీఫామ్‌లో పనికి వెళ్తున్నాడు. రోజూ గేదలకు మేత వేయడం.. సమీపంలోని పొలంలో నుంచి గడ్డి కోసి తీసుకురావడం.. గేదెలను కడగడంలాంటి కూలి పనిచేస్తున్నాడు. ఇతనికి రోజుకు మూడు వందల రూపాయల కూలీ వస్తోందని తెలిపాడు.
కాగజ్‌నగర్ బాలాజీనగర్‌కు చెందిన సోమ్ రాజు ఆర్టీసీ డ్రైవర్. ఆసిఫాబాద్ డిపోలో పనిచేసేవాడు. సమ్మె నేపథ్యంలో చేసేది లేక ప్రత్యామ్నాయంగా తనకు వచ్చిన టైలరింగ్ పని చేసుకుంటున్నాడు. స్థానిక మార్కెట్ ఏరియాలోని ఓ టైలర్ షాప్‌లో రోజు కూలీకి దుస్తులు కుడుతున్నాడు. ఈ పని ద్వారా రోజుకు రెండు నుంచి మూడు వందల వరకు కూలీ వస్తోందని చెబుతున్నాడు. సిర్పూర్(టి) మండలానికి చెందిన లక్ష్మన్ ఆర్టీసీ డ్రైవర్. ఆసిఫాబాద్ డిపోలో పనిచేసేవాడు. సమ్మెతో ఉపాధి కరువైంది. దీంతో తనకు వచ్చిన వంటపనిని చేయాలని నిర్ణయించుకున్నాడు. కాగజ్‌నగర్ పెట్రోలు పంప్ ఏరియాలోని ఒక హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. రోజూ సిర్పూర్ (టి) నుంచి కాగజ్‌నగర్‌కు 20 కిలోమీటర్ల దూరం వచ్చి.. రోజుకు మూడు వందల కూలికి ఇలా హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇక మరి కొంతమంది సెంట్రింగ్ పనిలోకి కూలీలుగా వెళ్తున్నారు. కొందరు డ్రైవర్లు ఆటోలు, టాటా మ్యాజిక్‌లు నడుపుకుంటున్నారు. ఏదో ఒక పని చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. సమ్మె రోజుకో మలుపులు తిరుగుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోక ఇలా పొట్టకూటి కోసం నానా కష్టాలు పడుతున్నారు.
ఇప్పటికైనా.. సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తమ డిమాండ్లను పరిశీలించి.. చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని.. తమ బతుకులను కాపాడాలని కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు. సమ్మెపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 46 రోజులు అవుతున్నప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల్లో ఎలాంటి క్లారిటీ లేక పోవడంతో తీవ్ర వేదన పడుతున్నారు. ఇంటి ఖర్చులు వెళ్లదీసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. వేతనాలు అందకపోవడంతో జీవితాలు దుర్భరమయ్యాయని ఆర్టీసీ మహిళా కార్మికులు అంటున్నారు.