చిరంజీవి ‘సైరా’ సినిమాలో నటించిన నటుడు వడదెబ్బతో మృతి

  • Published By: madhu ,Published On : May 16, 2019 / 02:41 AM IST
చిరంజీవి ‘సైరా’ సినిమాలో నటించిన నటుడు వడదెబ్బతో మృతి

Updated On : May 16, 2019 / 2:41 AM IST

నగరంలో ఎండల తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి చెందిన కెమెరాలో ఫొటోల ఆధారంగా ‘సైరా’ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ (38) టూరిస్టు వీసాపై మార్చి నెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. గచ్చిబౌలిలోని DLF గేట్ నెంబర్ -1 వద్ద ఇతను అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన ప్రకారం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 14వ తేదీ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

ఈ నెల 4, 5 తేదీల్లో ‘సైరా’ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించాడని పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌లో నివాసం ఉన్నాడు. మే 10వ తేదీన హోటల్ ఖాళీ చేశాడు. తర్వాత రోడ్లపైనే తిరిగాడని తెలుస్తోంది. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్‌కు సమాచారం అందించామని, అతను వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.