తెగని ఉత్కంఠ : కేబినెట్ విస్తరణపై నేతల్లో టెన్షన్

హైదరాబాద్: తెలంగాణాలో క్యాబినెట్ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల్లోపు ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ధీమా నేతల్లో వ్యక్తం అవుతున్నా…..ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ అన్నదానిపై చర్చ జరుగుతూనే ఉంది. దాదాపు రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా కొన్ని రోజులుగా నేతల్లో ఈ చర్చ మరింత ఎక్కువైంది. మరోవైపు క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణాలో సుమారు రెండు నెలలుగా చర్చనీయంశంగా మారిన మంత్రి వర్గ విస్తరణపై తుది కసరత్తు పూర్తయిందన్న ప్రచారం అధికార పార్టీ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి వర్గ కూర్పు పై ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయానికి వచ్చారన్న వార్తలు గులాబి పార్టీ నేతల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ సహా మరో మంత్రిగా మహ్మూద్ అలీలు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు రెండు నెలలుగా శుభముహూర్తాలు లేకపోవడం కారణంగానే మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్దగా దృష్టి సారించలేదు. ఈ నెల 6 వ తేదీ నుంచి మంచి రోజులు రావడంతో….మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందన్న ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
ఫిబ్రవరి10 వ తేదీన ఆదివారం వసంత పంచమి కావడంతో అదే రోజు క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేతలు అంచనా వేస్తున్నారు. ప్రగతి భవన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు పొక్కక పోవడం విస్తరణకు సంబంధించి ఎలాంటి హడావుడి లేకపోవడం వంటి అంశాలను కీలక నేతలు ప్రస్తావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న ప్రచారం జరుగుతున్నా ఆ రోజు క్యాబినెట్ విస్తరణ జరుగకపోతే 18వ తేదీలోపు మినీ క్యాబినెట్ ఖచ్చితంగా కొలువు దీరే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు.క్యాబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని భావిస్తున్న పలువురు నేతలు మాత్రం ప్రగతి భవన్ నుంచి ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందా అన్న ఉత్కంఠతో ఉన్నారు. సాధ్యమైనంత వరకు హైదరాబాద్ లోనే ఉండే ప్రయత్నాలను కూడా ఆ నేతలు చేస్తున్నారు.