మైక్రో ఆర్ట్ : బియ్యపు గింజలపై భగవద్గీత శ్లోకాలు చెక్కిన హైదరాబాద్ అమ్మాయి

  • Published By: nagamani ,Published On : October 20, 2020 / 11:36 AM IST
మైక్రో ఆర్ట్ : బియ్యపు గింజలపై భగవద్గీత శ్లోకాలు చెక్కిన హైదరాబాద్ అమ్మాయి

Updated On : October 20, 2020 / 11:46 AM IST

Telangana: హైదరాబాద్‌ ఉప్పుగూడలోని అంబికానగర్‌కు చెందిన రామగిరి స్వారిక తన మైక్రో ఆర్ట్ లో విశేషమైన ప్రతిభ కనబరుస్తోంది. బియ్యం గింజలపై భగవద్దీతను రాసి అందరినీ ఆకట్టుకున్నారు. 4వేల 042 బియ్యపు గింజలపై ‘భగవద్గీత’ లోని 18 అధ్యాయంలోని 700 శ్లోకాలను అద్భుతంగా ఆవిష్కరించింది స్వారిక.


ఈ సందర్భంగా స్వారిక మాట్లాడుతూ..బియ్యపు గింజలపై భగవద్గీత శ్లోకాలు రాయటం పూర్తి కావటానికి 150 గంటలు పట్టిందని తెలిపింది. ఇప్పటి వరకూ తాను 2 వేలకు పైగా మైక్రో ఆర్ట్‌వర్క్‌లను తయారు చేశానని..మిల్క్ ఆర్ట్, పేపర్ చెక్కడం, అతి చిన్న గింజలైన నువ్వులపై కూడా బొమ్మలు వేయటం చేశానని.. అలాగే బియ్యపు గింజలపై గణేషుడు బొమ్మ..ఆగ్ల వర్ణమాల రాశానని మైక్రో ఆర్టిస్ట్ తెలిపింది.


అరోరా కాలేజీలో లా చదువుతున్న స్వారిక ఓ పక్క చదువును కొనసాగిస్తూనే మక్రో ఆర్టిస్టుగా రాణిస్తోంది. గతంలో తన తన మైక్రో ఆర్ట్ తో 15 నిమిషాల్లో బియ్యం గింజలపై ఏ నుంచి జెడ్‌ వరకు ఆంగ్ల పదాలు,ఒకే ఒక్క బియ్యపుగింజపై భారతదేశపు జాతీయ పతాకం, వినాయకుడి ప్రతిమను చెక్కి 2017లో లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించింది.


2009లో సికింద్రాబాద్‌లో నిర్వహించిన అన్నమయ్య కీర్తనలు, లక్ష గళార్చన కార్యక్రమంలో తన స్వరం తో శ్రోతలను ఆకట్టుకోవడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. ఇప్పుడు భగవద్గీతలోని శ్లోకాలను బియ్యం గింజలపై రాసి మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. గత ఐదేళ్లుగా..మైక్రో ఆర్ట్ తో ప్రతిభను కనబరుస్తోంది స్వారిక.


శ్రీనివాసాచారి, శ్రీలత దంపతుల కుమార్తె అయిన స్వారిక సూక్ష్మ కళాకారిణిగా గతంలో వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. తాజాగా..రాష్ర్టీయ పురస్కార్‌కు ఎంపికైంది. భారతదేశపు మొట్టమొదటి మహిళా మైక్రో ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందింది.