సత్తా చాటేనా : నా కుటుంబం – బీజేపీ కుటుంబం

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 01:15 AM IST
సత్తా చాటేనా : నా కుటుంబం – బీజేపీ కుటుంబం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఇక్కడైనా గెలిచి అండగా నిలవాలనుకుంటోంది. ఇందుకోసం అధిష్టానం పెద్దలు తెలంగాణపై దృష్టి సారించారు. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో.. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో గెలుపొందింది. కాగా టీడీపీ, ఎంఐఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీలు ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బీజేపీ.. ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇందుకోసం వ్యూహాలను రచిస్తోంది. ఈసారి ఉత్తరాదిన గడ్డుకాలం ఉన్న నేపథ్యంలో.. కమలం పార్టీకి తెలంగాణలో ప్రతి సీటు కీలకం కానుంది. 

గత ఎన్నికల్లో ఎదురే లేకుండా గెలిచిన బీజేపీకి.. కర్నాటక, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురైతే.. ఏంటనే డైలమాలో కమలం నేతలు పడ్డారు. దానికితోడు నోట్ల రద్దు, జీఎస్టీలాంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పార్లమెంట్‌ సీటును బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గెలిచే సత్తా ఉన్నవారికి మాత్రమే ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడంతో పాటు కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావొచ్చని అంచనా వేస్తోంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీజేపీ.. ఈసారి పార్లమెంట్‌ ఎన్నికలకు ‘నా కుటుంబం-బీజేపీ కుటుంబం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అలాగే బీజేపీ అధిష్టాన పెద్దలు పార్లమెంట్‌ ఇన్‌చార్జీలు, కోర్‌ కమిటీ సభ్యులతో భేటీలు నిర్వహించి.. ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే అభ్యర్థుల ఎంపికను చేపట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.