మూసీని సబర్మతిలా చేస్తానన్న కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 08:46 AM IST
మూసీని సబర్మతిలా చేస్తానన్న కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి

Updated On : December 16, 2019 / 8:46 AM IST

మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్  బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూసీ నది  పరిసరాల్లో పండిన  కూరగాయలు విషతుల్యంగా మారాయాన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని విషాద నగరంగా మార్చారని లక్ష్మణ్ విమర్శించారు. 

బాపూ ఘాట్ వద్ద కూడా మూసీ దుర్గంధంగా మారటం బాధాకరమని అన్నారు. నదుల ప్రక్షాళనకు 2001లో వాజ్ పేయి నిధుల్ని కేటాయించారనీ..ఆ నిధుల్ని రాష్ట్రాలు పక్కదారి పట్టించాయని విమర్శించారు.  ప్రధాని మోదీ ఇచ్చిన ‘నమామి గంగే స్ఫూర్తి’తో‌ మూసీ నది ప్రక్షాళనోద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. మూసీ నదిని శుద్ధి చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. 

మూసీనదిని ప్రక్షాళన చేస్తామన్న హామీని..‌ కేసీఆర్ విస్మరించారని లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌కు మంచి నీరందింస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కబ్జాకు గురయ్యాయనీ దీన్ని ప్రభుత్వం పట్టించుకోవటంలేదన్నారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ.3వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. మూడు రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.