షాకింగ్ : తెలంగాణ నుంచి 2లక్షల 72వేల కోట్లు తీసుకుంటే.. కేంద్రం తిరిగి ఇచ్చింది 31వేల కోట్లే

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకునేది ఎక్కువ ఇచ్చేది తక్కువ అని సీరియస్ అయ్యారు. సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఐదేళ్లలో పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రం 2లక్షల 72 వేల కోట్ల రూపాయలు తీసుకుంటే.. రాష్ట్రానికి కేవలం 31వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. కేంద్రం తీరుతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. మోడీ సర్కార్ సహకరించకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తోందని చెప్పారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2019 లెక్క తేలింది. ఈసారి బడ్జెట్ పరిమాణం తగ్గింది. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.1,46,492.30 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు. మూల ధన వ్యయం రూ.17,274.67 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.67 కోట్లు. ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు. సీఎం కేసీఆర్ సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
దేశంలో ఆర్థిక మాంద్యం గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన ఏడాదిన్నరగా దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉందని కేసీఆర్ చెప్పారు. జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిందని అన్నారు. 2019 తొలి త్రైమాసికంలో కేవలం 5శాతమే వృద్ధి నమోదైందన్నారు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గిందన్నారు. ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని వెల్లడించారు. 11శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయిందన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించాల్సి వచ్చిందన్నారు.
ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించాము అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వచ్చిందన్నారు. రూ.లక్ష 65వేల 167 కోట్ల మూలధనాన్ని వ్యయం చేశామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చర్యల వల్ల సుస్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు నమోదైందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయ్యిందన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ సుసంపన్నమైందని సీఎం చెప్పారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 5.8శాతం వృద్ధి నమోదైందన్నారు. ఐటీ ఎగుమతుల విలువ రూ.1,10,000 కోట్లకు చేరిందన్నారు.