కొత్తమంత్రులు వీరే : ఇవాళే ప్రమాణం

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్తమంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించబోతున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 01:58 AM IST
కొత్తమంత్రులు వీరే : ఇవాళే ప్రమాణం

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్తమంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించబోతున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్తమంత్రులతో ప్రమాణం చేయించబోతున్నారు గవర్నర్ నరసింహన్. పాత, కొత్త కలయికతో కనిపించబోతున్న ఈ కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వేదికగా మారేందుకు రాజ్ భవన్ ముస్తాబయ్యింది.

ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ మరికొద్ది గంటల్లో జరగనుంది. మొత్తం 10మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్…  పాత, కొత్త కలయికతో  కేబినెట్ ను కూర్చారు. ఖమ్మం జిల్లానుంచి మాత్రం ఈసారి కేబినెట్ లో ఎవరికీ చోటుదక్కకపోగా.. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలకు మాత్రం రెండేసి మంత్రి పదవులు దక్కాయి. గత కేబినెట్‌లోని నలుగురికి మరోసారి మంత్రులుగా అవకాశం ఇచ్చిన గులాబీ బాస్… ఆరుగురు కొత్తవారికి చోటు కల్పించారు.

ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, జగదీశ్‌ రెడ్డి… కేసీఆర్ కేబినెట్‌లో రెండోసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుండగా… తొలిసారి మంత్రులుగా..  ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అమాత్య పదవులను అలంకరించబోతున్నారు. 

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవంన్న ఎర్రబెల్లి… తొలిసారి మంత్రి కాబోతుండగా… కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో పనిచేశారు. ఇపుడు మంత్రి పదవి చేపట్టబోతున్నారు. కొప్పుల ఈశ్వర్ గత అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేయగా ఈసారి మంత్రి కాబోతున్నారు. గతంలో మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శిగా కొంతకాలం విధులు నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్‌ కి ఈసారి మంత్రులుగా ప్రమోషన్ లభించింది. ఇక.. గతంలో ఎంపీ పనిచేసిన మల్లారెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమేకాదు.. మంత్రి పదవి చేపట్టబోతున్నారు.

తాజా విస్తరణలో చేరే పదిమందితో కలిపి తెలంగాణలో మంత్రుల సంఖ్య 12కి చేరుకోనుంది. పమిగిలిన ఖాళీలను లోక్‌సభ ఎన్నికల తర్వా భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక.. గత కేబినెట్‌లో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన పద్మారావు గౌడ్‌కు ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద రెండు నెలలుగా జోరుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ ఎట్టకేలకు మంత్రివర్గం ఏర్పాటు కాబోతోంది.