Sweet News : రైతుల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు!

తెలంగాణ రాష్ట్ర రైతులకు సర్కార్ తీపి కబురును అందించనుంది. రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాల్లో మరికొన్ని రోజుల్లో డబ్బులు పడనున్నాయి. దాదాపు 9.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. నిధుల విడుదలపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రబీ సీజన్‌లో ఎన్నికలు రావడం..ఎన్నికల సంఘం ‘రైతు బంధు’ చెక్కులకు నో చెప్పడంతో నిలిచిపోయింది. కొత్త లబ్ధిదారులను చేర్చవద్దని..ఉన్న వారికి చెక్కుల పంపిణీ చేయవద్దని…ఖరీఫ్‌లో ఉన్న లబ్దిదారులకే ఆన్ లైన్ ద్వారా బదిలీకి వెసులుబాటు కల్పించింది. దీనితో అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా వివరాలు సేకరించారు. రబీ సీజన్‌కు సంబంధించి 43.84 లక్షల మంది రైతులకు రూ. 4.724 కోట్లు పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం మరలా రైతు బంధు కార్యక్రమం చేపట్టలేదు.
పెన్షన్లు, వేతనాలు, సంక్షేమ శాఖల పథకాలకు నిధులు, ఇతరత్రా వాటికి నిధులు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో రైతు బంధుకు నిధులు తాత్కాలికంగా ఆపివేశారు. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడ్డాయని ప్రచారం జరిగింది. మొత్తంగా 9.06 లక్షల మంది రైతన్నలకు రూ. 676 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు…మూడు రోజుల్లో రైతు బంధు నగదును పంపిణీ చేస్తారని సమాచారం. ఎన్నికల సందర్భంగా ఎకరానికి రూ. 5వేలు ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఖజానాపై మరింత భారం పడే అవకాశాలున్నాయి.