పంచాయతీ సమరం : 80 శాతం పోలింగ్

హైదరాబాద్ : పంచాయతీ సమరంలో తొలి విడతగా జరిగిన ఎన్నికల పోలింగ్ కరెక్టుగా మధ్యాహ్నం 1గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. జనవరి 21వ తేదీ సోమవారం 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 80 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. పలు కేంద్రాల్లో ఓటు వేయడానికి ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఎంత శాతం నమోదైందో అధికారులు ప్రకటించనున్నారు. మొత్తం 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 28,976 వార్డులకు 70,094 మంది పోటీ పడుతున్నారు.సోమవారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి ఓటర్లు క్యూ లైన్‌లో బారులు తీరారు. అధిక సంఖ్యల్లో పట్టణాల నుండి గ్రామాలకు తరలివెళ్లారు. జిల్లాల్లోని పలు గ్రామాల్లో యువతీ, యువకులు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచారు. ఆయా పంచాయతీల్లో కొన్ని ఘటనలు మినహా…ప్రశాంతంగా ముగిసింది.
పూర్తి ఫలితాలు
మధ్యాహ్నం 1గంటకు పోలింగ్ నిలిపివేశారు. క్యూ లైన్‌లలో నిలిచి ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. బ్యాలెట్ పత్రాల బాక్సులను సీజ్ చేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ముందుగా వార్డు స్థానాలు లెక్కించిన తరువాత సర్పంచ్ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు పూర్తయిన తరువాత ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. చేతులెత్తే పద్ధతిలోనే ఈసారి కూడా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. తొలివిడుత జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారనేది తెలియాలంటే సాయంత్రం 5గంటల వరకు పడుతుందని అంచనా వేస్తున్నారు.