షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు : నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరగనున్నాయి. మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 03:14 AM IST
షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు : నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరగనున్నాయి. మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరగనున్నాయి. మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్‌ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. షెడ్యూల్‌ ప్రకారం మున్సిపల్‌ ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. కరీంనగర్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 పురపాలికల్లోని 325 కార్పొరేటర్‌, 2,727 కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  

జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితా, తుది జాబితాకు తేడా ఉన్నందునే కరీంనగర్‌ కార్పొరేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేయలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో తప్పుల కారణంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేసినట్లు తెలిపారు. రిజర్వేషన్లలో ఏమైనా తేడాలుంటాయా లేదా అనే అంశంపై పురపాలక శాఖను వివరణ కోరినట్లు చెప్పారు. పురపాలకశాఖ వివరణ ఇస్తే నోటిఫికేషన్ విడుదల చేసి కరీంనగర్‌కూ ఇదే షెడ్యూల్‌లో ఎన్నికలు జరుపుతామని తెలిపారు. అటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని డభీర్‌పుర ఎన్నికను కూడా వీటితో పాటే పెడతామని నాగిరెడ్డి ప్రకటించారు. మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు కమిషనర్‌ నాగిరెడ్డి. 

ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చు. ఈనెల 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఓటింగ్‌ ఉంటుందని కమిషనర్‌ తెలిపారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపడతారు.