సికింద్రాబాద్‌లో త్రిముఖ పోటీ : గెలుపెవరిది?
లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.

లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. సికింద్రాబాద్‌లో తమ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ బీజేపీకి సిట్టింగ్ స్థానం. దీంతో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. కానీ ప్రచారంలో మాత్రం ముందుంది. ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులతో రెండు సమావేశాలు నిర్వహించింది. ఆత్మగౌరవ సభల పేరుతో బీసీ, ఎస్సీలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. కమల్ జ్యోతి పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కాపాడుకోలేక పరాభవంపాలైన బీజేపీ… ఎలాగైనా ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్….. 16 ఎంపీ స్థానాలను గెలవాలన్న లక్ష్యం పెట్టుకుంది. సికింద్రాబాద్ స్థానాన్ని ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్‌పై గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నీ టీఆర్‌ఎస్సే గెలవడంతో తమ విజయం నల్లేరు మీద నడకేనని గులాబీదళం భావిస్తోంది.
2004 , 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన అంజన్‌కుమార్ రెండు సార్లూ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం బండారు దత్తాత్రేయ చేతిలో ఓటమి చవి చూశారు. ఈసారి కూడా కాంగ్రెస్ అధిష్టానం అంజన్‌కుమార్ యాదవ్‌నే అభ్యర్థిగా ఖరారు చేసింది. రెండవ జాబితాలోనే అంజన్‌కుమార్ పేరును ప్రకటించింది. అయితే అభ్యర్థులను ప్రకటించని బీజేపీ, టీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటే… కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఇంకా ప్రచారంలోకి దిగలేదు. దీంతో కాంగ్రెస్ ప్రస్తుతం ప్రచారంలో వెనుక వరుసలో ఉంది.
మొత్తానికి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. మూడు పార్టీలూ సికింద్రాబాద్‌ను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరి సికింద్రాబాద్‌పై ఎవరి జెండా ఎగురనుందో.. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.