తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సెప్టెంబర్ 29న అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం.
ఇందులో భాగంగా విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో భూమి పూజతో మట్టిని సేకరించి ఛత్ర, చామర మంగళ వాయిద్యాలతో మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాలికల్లో శాలి, వ్రహి, యవ, మద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలతో అంకురార్పణ చేశారు. ఆలయ నైరుతి మూలలో అర్చకులు భూమి పూజ నిర్వహించారు. ఈ అంకురార్పణ క్రతువుతో ఈ మహావేడుక ప్రారంభమైంది.
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలతో తిరుమల గిరులు పండగ శోభను సంతరించుకున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 30 సోమవారం సాయంత్రం గం.5.23 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ధ్వజారోహణం అనంతరం శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి వాహనసేవలు ప్రారంభంకానున్నాయి.