ఢిల్లీలో చక్రం తిప్పేది TRS – కేసీఆర్

దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పేది TRS పార్టీయేనని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తుందని తెలిపారు. పలు రిపోర్టుల్లో ఇదే నివేదించారని వెల్లడించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ZPTC, MPTCల పదవీకాలం ముగియనుండడంతో.. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒకే చెప్పింది.
ఏప్రిల్ మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో.. TRS పార్టీ అప్రమత్తమైంది. దీంతో తెలంగాణ భవన్‌లో ఏప్రిల్ 15వ తేదీ సోమవారం ఆ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై కేసీఆర్ చర్చించారు.
535 జెడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ, 32 జెడ్పీ చైర్మన్ పదవులు గెలవాలని కేసీఆర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మంత్రులదేనని తేల్చారు. అభ్యర్థులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారని వెల్లడించారు. రెండు జిల్లాలకు ఒక్కరు చొప్పున మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కో-ఆర్డినేటర్లుగా నియమించారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, కొత్త వారికి అవకాశాలు వస్తాయని కేసీఆర్ నేతలకు హామీనిచ్చారు.
మే నెలలో మూడు దశల్లో MPTC, ZPTC ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మే 6, మే 10, మే 14 తేదల్లో పరిషత్ ఎన్నికలు జరుగుతాయని, షెడ్యూల్‌ని ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారు. మూడు దశల్లోనూ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడే రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.