పోటీకి ఆసక్తి : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరేనా 

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 01:08 AM IST
పోటీకి ఆసక్తి : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరేనా 

Updated On : February 13, 2019 / 1:08 AM IST

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌… సిట్టింగ్‌లందరికీ దాదాపు టికెట్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గత ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచిన స్థానాల్లో ఎవరికి టికెట్లు కేటాయించాలనే అంశంపై కూడా తీవ్రంగా చర్చిస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం స్థానం మినహా మిగతా అన్ని స్థానాలను ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్న గులాబీ పార్టీ.. ఇందుకోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. 

ఎంపీలు బాల్క సుమన్‌, మల్లారెడ్డిలు గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో ఆ స్థానాల్లో పోటీ చేసేందుకు అనేకమంది నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ గెలిచిన నాగర్‌కర్నూలు, సికింద్రాబాద్‌ స్థానాలపై కూడా పలువురు దృష్టి సారించారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని గులాబీ బాస్‌ను కోరుతున్నారు. 

ఇదిలావుంటే.. పెద్దపల్లి స్థానాన్ని మాజీ ఎంపి వివేక్‌ ఆశిస్తున్నా ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీ వివేక్‌ను పోటీ చేయిస్తుందా.. లేక వేరేవారికి అవకాశం ఇస్తుందా అనే అనుమానం తలెత్తుతుంది. మల్కాజిగిరి స్థానానికి చాలామంది నేతలు పోటీ పడుతున్నా… ప్రభుత్వ మాజీ సలహాదారు రాజీవ్‌శర్మ పేరు పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల స్థానంలో మాజీమంత్రి మహేందర్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌గా ఉన్నా… చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగర్‌కర్నూలులో పార్టీ ప్రధాన కార్యదర్శి రాములు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే మందా జగన్నాథం కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ఇక సికింద్రాబాద్‌ స్థానంలో ఓ బీసీ నేతలను రంగంలోకి దించే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి సహా పలువురు నేతల పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

ఈనెల 25 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తర్వాత గులాబీ దళపతి లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. పలువురు సీనియర్లను ఎంపీలుగా పోటీ చేయించే అవకాశం ఉందని నేతలంటున్నారు. ఈ జాబితాలో కడియం, తుమ్మల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. చివరి నిమిషం వరకు కేసీఆర్‌ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుండగా.. మిగతా స్థానాల్లో పోటీకి పలువురు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న గులాబీబాస్‌ మాత్రం పలువురు సీనియర్లను రంగంలోకి దింపే యోచనలో ఉన్నారు.