టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ : పార్టీ మారేందుకు నేతలు రెడీ

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 03:16 PM IST
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ : పార్టీ మారేందుకు నేతలు రెడీ

Updated On : March 3, 2019 / 3:16 PM IST

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్ఎస్… ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో పార్టీ మారేందుకు నేతలు రెడీ అవుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. 

తెలంగాణలో మళ్లీ ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుంటే… ఆపరేషన్ ఆకర్ష్ కూడా జోరందుకుంది. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది టీఆర్ఎస్. పార్టీ మారేందుకు రెడీగా ఉన్న నేతలను కారెక్కించేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు.. అధికార పార్టీలో చేరేందుకు రెడీ అంటూ ప్రకటనలు చేసేస్తున్నారు. దీంతో.. మండలి ఎన్నికల నాటికి ఎవరు ఏపార్టీలో ఉంటారు. ఎవరు ఎవరికి ఓటేస్తారనే విషయం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే… ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు దూరమయ్యే ఎమ్మెల్యేల సంఖ్యపై పూర్తి క్లారిటీ వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు… త్వరలోనే అంటే… పార్లమెంట్ ఎన్నికల నాటికి నేతలు గులాబీ గూటికి చేరడం పూర్తవుతుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. అవసరమైతే.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి.. తిరిగి అధికార పార్టీ నుంచి శాసన సభకు పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. 

పార్టీ ఫిరాయింపుల అంశంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి ఎవరికీ అవకాశం ఇవ్వొద్దని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగానే… కారెక్కేందుకు సిద్ధమవుతున్న నేతలు…  పార్టీ పదవులతో పాటు… ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావ్, ఆత్రం సక్కు కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కూడా అవసరమైతే ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అని ప్రకటించారు. దీంతో.. కేసీఆర్ నిర్ణయం మేరకే… టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధపడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక.. పార్లమెంట్ ఎన్నికల నాటికి.. కనీసం 8నుంచి 10మంది ఎమ్మెల్యేలు కారెక్కే అవకాశం ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.