డెడ్ లైన్ బేఖాతర్ – విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులు – కొత్త నియామకాలకు సన్నాహాలు

ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు విధుల్లో చేరాలని లేకపోతే వారిని తొలగిస్తామని హెచ్చరించింది. సర్కార్ డెడ్ లైన్ ను పట్టించుకోలేదు ఆర్టీసీ కార్మికులు. విధుల్లో చేరలేదు. సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఉధృతం చేసింది ప్రభుత్వం. 6 వేల మందిని తాత్కాలికంగా నియమించుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభించారు ఉన్నతాధికారులు. 4వేల మంది డ్రైవర్లు, 2వేల మంది కండక్టర్లను కాంట్రాక్ట్ పద్దతిలో నియమించాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. తాత్కాలిక సిబ్బందితో డిపోల నుంచి బస్సులను బయటకు తీయాలని నిర్ణయించింది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే క్యాబ్ లు, స్కూల్, కాలేజీ బస్సులను తిప్పుతున్నారు.
అయినా గ్రామాలకు బస్ సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. ఎలాగైనా డిపోల నుంచి తాత్కాలిక కార్మికులతో బస్సులు బయటకు తీసుకొచ్చి.. తిప్పాలని గట్టిగా నిర్ణయించింది సర్కార్. పండుగ సమయంలో కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కఠినంగా ఉంది. ముందస్తుగా జాగ్రత్తగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పెంచింది. అక్టోబర్ 5వ తేదీ శనివారం 9వేల సర్వీసులను తిప్పింది. విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాలను అదనపు సర్వీసులను నడుపుతున్నది. అందుకోసం ప్రైవేట్ వ్యక్తులను కాంట్రాక్ట్ పద్దతిలో నియమించుకుంటోంది.
Read More : డ్యూటీకి రాకపోతే ఉద్యోగం ఊస్టింగ్, ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్