బిగ్ బ్రేకింగ్ : అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె, ప్రయాణికుల్లో ఆందోళన

  • Published By: madhu ,Published On : October 4, 2019 / 10:43 AM IST
బిగ్ బ్రేకింగ్ : అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె, ప్రయాణికుల్లో ఆందోళన

Updated On : October 4, 2019 / 10:43 AM IST

అర్థరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. వారం రోజులుగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ల పరిష్కారానికి పట్టుబట్టిన కార్మికులకు.. చర్చల కమిటీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో సమ్మె చేయాలని డిసైడ్ అయ్యారు కార్మికులు. దసరా పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా సమ్మె వాయిదా చేసుకోవాలని కోరింది ప్రభుత్వం. దీనికి నిరాకరించిన కార్మిక సంఘాలు.. అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మె సన్నాహాలు చేసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే..తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే దూరప్రాంత సర్వీసులు ఆగిపోయాయి. రాత్రివరకు మరిన్ని సర్వీసులు ఆగిపోయే అవకాశం ఉంది. అవసరమైతే పోలీసు బందోబస్తు మధ్య సర్వీసులు నడపాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. స్కూల్‌, ప్రైవేటు బస్సులను రంగంలోకి దింపాలని మౌలిక ఆదేశాలిచ్చింది. ప్రైవేటు బస్సులు, క్యాబ్‌లు ఎక్కువ ఛార్జీలు తీసుకోవద్దని అధికారులకు ఆదేశం ఇచ్చింది. 

ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌ శర్మ. 2100 అద్దె బస్సులను పోలీసు బందోబస్తుతో నడుపుతామన్నారు. అలాగే 20వేల స్కూల్‌ బస్సులున్నాయన్నారు. 3వేల మందిని తాత్కాలికంగా రిక్ర్యూట్ చేసుకున్నామని చెప్పారు. ప్రజారవాణాను ఎట్టి పరిస్థితిల్లోనూ ఆపేది లేదన్నారు సునీల్‌ శర్మ. ఆర్టీసీది బతుకు పోరాటమని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనన్నారు. సమ్మె విషయంలో తగ్గేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
Read More : ఆర్టీసీ కార్మికులకు నోటీసులు : పోలీసుల రక్షణలో అద్దె బస్సులు