ఆశలు ఆవిరి : ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన లేనట్లే

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తేల్చారు. దీంతో ఇక గడువు ప్రకారమే అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆరేళ్ల తర్వాతే నియోజకవర్గాలను పెంచే అవకాశముంది.
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఆశలు పెట్టుకున్న పార్టీలు
రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు జరుగుతుందని పార్టీలు ఆశపడ్డాయి. దీంతో గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వానికి నియోకవర్గాల పునర్విభజన చేపట్టాలని పలుమార్లు కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల డిమాండ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు పెడచెవిన పెట్టారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అటకెక్కింది.
రెండోసారి అధికారంలోకి ఎన్డీయే ప్రభుత్వం
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈసారైనా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తెలుగు రాష్ట్రాల నేతలు అంచనా వేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కొత్తగా రెండు అసెంబ్లీ నియోకవర్గాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో తెలంగాణలో ఉన్న 119 స్థానాలు… 153కు పెరగాలి. ఇక ఏపీలో 175 నియోజకవర్గాల నుంచి 225కు ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయని నేతలు అంచనా వేశారు.
నియోజకవర్గాల పునర్విభజనపై ఆసక్తి చూపని కేంద్రం
విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉంది. అయితే విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలపై పార్లమెంట్‌లో సవరణలు చేస్తేనే నియోజకవర్గాల పునర్విభజనపై అడుగులు పడేవి. కానీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు బేరీజు వేసుకుంటూ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇదే అంశాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదన ఏదీ లేదని తేల్చేశారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేదన్నది తేలిపోయింది. దీంతో పునర్విభజనపై ఆశలు పెంచుకున్న నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది.