తెలంగాణలో క్యాష్ పాలిటిక్స్ హీట్ : కాంగ్రెస్, టీఆర్ఎస్ మాటల యుద్ధం

  • Published By: madhu ,Published On : March 4, 2019 / 02:53 PM IST
తెలంగాణలో క్యాష్ పాలిటిక్స్ హీట్  : కాంగ్రెస్, టీఆర్ఎస్ మాటల యుద్ధం

Updated On : March 4, 2019 / 2:53 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నువ్వొకటంటే.. నే రెండంటా అనే స్థాయిలో నేతలు మాటల తుటాలు పేలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో.. ప్రారంభమైన మాటల యుద్ధం పెరిగి పెద్దదవుతూనే ఉంది. ఆత్రం సక్కు, రేగ కాంతారావు లేఖ రాసిన వెంటనే అత్యవసరంగా భేటీ అయిన సీఎల్పీ… ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్… మరోసారి ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొంటున్నారంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

టీపీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు రేగా కాంతారావు, ఆత్రం సక్కు. మేం అమ్ముడు పోతే.. కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మిగతా నేతలను ఎంతకు కొనుగోలు చేశారంటూ ప్రశ్నించారు. తమకు ఎలాంటి డబ్బు ఆఫర్‌ చేయలేదని, కేవలం ఆదివాసీల అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తేల్చిచెప్పారు. ఇదే ఇష్యూపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. పార్టీలు మారడం.. విధానాలు సమీక్షించుకోవడం సహజమేనని.. ఇదేదో కొత్త అన్నట్టు ఉత్తమ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పార్టీ మారిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, అంతకుముందు రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. క్యాష్ పాలిటిక్స్ హీట్ పెంచేస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.