‘అల్లాహ్ అక్బర్’ అని అరుస్తూ కత్తితో దాడి…ముగ్గురు మృతి

3 killed in attack at a church in Nice, ‘terror attack’ suspected ఫ్రాన్స్‌లోని నీస్ సిటీలో నాట్రేడేమ్ చర్చి సమీపంలో గురువారం(అక్టోబర్-29,2020)కత్తితో ఓ దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కత్తితో ఆగంతకుడు ఓ మహిళ తలను దారుణంగా నరికేశాడని అధికారులు తెలిపారు.
“అల్లాహ్ అక్బర్” అని పెద్దగా అరుస్తూ ఆగంతకుడు జరిపిన కత్తి దాడిలో మొత్తం ముగ్గురు చనిపోయారని, అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఉన్మాద చర్యకు పాల్పడిన నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపగా… ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఇది ఉగ్రవాద చర్యేనని నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి తెలిపారు. పోలీసుల దాడిలో గాయపడిన తర్వాత కూడా ఆగంతకుడు అల్లాహ్ అక్బర్ అంటూ ఏడ్చినట్లు ఆయన తెలిపారు. కాగా,ఫ్రాన్స్ లో గడిచిన రెండు నెలల్లో ఇది మూడవ ఎటాక్.
మరోవైపు,ఈ ఘటనకు.. ప్రవక్తపై కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్ విభాగం దర్యాప్తు చేపట్టనుంది. యాంటీ ఇస్లామిక్ ఎజెండా కొనసాగిస్తున్న అధ్యక్షుడు మాక్రన్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, కొద్ది రోజుల క్రితం మహమ్మద్ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను విద్యార్ధులకు చూపిస్తున్నారంటూ ఆగ్రహించిన 18 ఏళ్ల ముస్లిం యువకుడు ఒక ఫ్రెంచ్ టీచర్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే.ఈ హత్యకు వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వచ్ఛకు మద్దతుగా ఫ్రాన్స్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. లౌకికవాదం గురించి చర్చలు కూడా జరిగాయి.
ఇస్లాం మతస్థులు ప్రవక్తగా భావించే మహమ్మద్ కార్టూన్లను స్కూల్‌లో ప్రదర్శించారన్న కారణంతో టీచర్‌ను ముస్లిం యువకుడు తలనరికి దారుణంగా చంపాడు. ఫ్రెంచ్ ఉపాధ్యాయుడి హత్య తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చేసిన కామెంట్లు ఇస్లామిక్ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి.
ఉపాధ్యాయుడి హత్యను ఇస్లామిక్ టెర్రరిస్టు దాడిగా మేక్రాన్ అభివర్ణించారు. మహమ్మద్ ప్రవక్త వివాదాస్పద కార్టూన్‌ల ప్రదర్శనను మేక్రాన్ సమర్ధించారు. ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతింటాయని భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోలేమని మేక్రాన్ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఫ్రాన్స్ సమగ్రతను దెబ్బతీయడమేనని మేక్రాన్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని 60 లక్షలమంది ముస్లింలు ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇస్లాం మతమే సంక్షోభంలో ఉందని ఈ సందర్భంగా మేక్రాన్ వ్యాఖ్యానించారు
ఫ్రాన్స్ అధ్యక్షుడు మత విశ్వాసాలను గుర్తించడం లేదని, ఫ్రాన్స్‌లో లక్షలమంది ముస్లింల స్వేచ్ఛను హరిస్తున్నారని టర్కీ, పాకిస్తాన్ దేశాలు ఆరోపించాయి. మేక్రాన్ ప్రకటనకు నిరసనగా ఫ్రాన్స్‌లో తయారైన వస్తువులను బహిష్కరించాని పలు ముస్లిం దేశాలు పిలుపు నిచ్చాయి. ఇప్పటికే కువైట్, జోర్డాన్, ఖతార్‌లలోని కొన్ని షాపుల నుంచి ఫ్రెంచ్ దేశానికి చెందిన వస్తువులను తొలగించారు. లిబియా, సిరియా, గాజా ప్రాంతాలలో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే ముస్లింలలోని ఒక ‘అతివాద’ వర్గం వస్తు నిషేధంపై అనవసరమైన ప్రకటనలు చేస్తోందని ఫ్రాన్స్ విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.