కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాం…సమర్థవంతంగా పనిచేస్తోందంటూ ఇటలీ సంచలన ప్రకటన

మొదటి కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేసే రేసులో ఇటలీ ముందంజలో నిలిచింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగుతున్న వేళ ఇటలీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. తమ శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారుచేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ఇప్పుడు ప్రపంచదేశాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
‘టకీస్’రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగం విజయవంతమైనట్టు ఇటలీ తెలిపింది. ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీబాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్థంగా పనిచేస్తుందని ఇటలీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ను రోమ్‌లోని స్పల్లాంజనీ హాస్పిటల్‌లో పరీక్షించినట్టు వివరించింది. కరోనా వైరస్ వ్యాక్సీన్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో తెలిపారు.
ఈ వేసవి తర్వాత మానవులపై పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎలుకలకు ఒక్క డోస్ ఇవ్వగానే.. ఎలుకల్లో యాంటీబాడీలు అభివృద్ధి చేసిందని, ఇది వైరస్‌ను మానవ కణాలకు సోకకుండా నిరోధించగలదని అరిసిచియో అన్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా, అంచనాలకు మించి ఉన్నాయని ఇటాలియన్ పరిశోధకులు వ్యాఖ్యానించారు. అమెరికన్ ఔషధ సంస్థ లీనియాఆర్ఎక్స్‌తో టకిస్ మరింత మమ్మురంగా పరిశోధనలు సాగించనున్నట్టు అరిసిచియో తెలిపారు.
వ్యాక్సిన్ ద్వారా కరోనా వైరస్ ను తటస్థీకరించడం ప్రపంచంలో ఇదే తొలిసారని, ఆ పనిని టకీస్ చేసిందని, మానవులపై కూడా ఇది పని చేస్తుందని భావిస్తున్నట్టు స్పల్లాంజనీ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కాగా,ఇటీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటలీలో ఇప్పటివరకు 213,013 పాజిటివ్ కేసులు నమోదుకాగా,29,315మరణాలు నమోదయ్యాయి. 85,231మంది కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు, ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్శిటీ కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధకుడు జోనాథన్ గెర్షోని నేతృత్వంలోని బృందం ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ డిజైన్‌ను రూపొందించినట్టు ప్రకటించింది. ఇజ్రాయెల్ రూపొందిచిన డిజైన్‌కి మార్చిలోనే అమెరికా పేటెంట్ కూడా ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 258,295మందిని బలితీసుకున్న కోవిడ్-19కు వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి.
కరోనా పోరులో విజయం సాధించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం. ఈ ఆయుధం కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ముందుగా వ్యాక్సిన్‌ను ఎవరు అభివృద్ధిచేసినా అందరి లక్ష్యం ఒక్కటే కాబట్టి.. ఎవరు శుభవార్త చెబుతారనే ఆసక్తి నెలకుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ గురించి ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆశలు రేకిత్తిస్తోంది. ఇక,ప్రపంచవ్యాప్తంగా 3,726,704 కేసులు నమోదుకాగా, 258,295మరణాలు నమోదయ్యాయి. అత్యధిక కేసులు,మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి.
Also Read | కోవిడ్-19 నియంత్రణలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న డ్రగ్.. ఇండియాలో ట్రయల్స్